Begin typing your search above and press return to search.

అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాలకు ఈ ఘటన ఓ హెచ్చరిక

అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు కుటుంబానికి ఊహించని చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

By:  A.N.Kumar   |   3 Sept 2026 5:00 PM IST
అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాలకు ఈ ఘటన ఓ హెచ్చరిక
X

అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు కుటుంబానికి ఊహించని చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. మేరీల్యాండ్‌లో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న ఓ తెలుగు మహిళ.. తమతో పాటు ఇంట్లో ఉంటున్న ఇద్దరు స్నేహితులపై అనుమానం రావడంతో ఇంటిని పరిశీలించగా షాకింగ్ విషయం బయటపడినట్లు సమాచారం. ఇంట్లోని ప్రైవసీకి భంగం కలిగించేలా రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె ఆరోపించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

స్నేహితులనే నమ్మితే.. ఇలాంటి షాక్

తెలుగువారిలో చాలామంది అమెరికాలో ఉద్యోగాలు, చదువులు, ఇతర కారణాలతో వెళ్లిన తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు స్నేహితులతో కలిసి ఇళ్లు షేర్ చేసుకుంటుంటారు. ఇదే విధంగా మేరీల్యాండ్‌లోని ఓ ఇంట్లో తెలుగు దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు మరో ఇద్దరు పురుష స్నేహితులతో కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతకాలం తర్వాత ఆ మహిళకు ఇంట్లో ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందన్న భావన కలిగిందని చెబుతున్నారు. దీంతో ఆమె తన ఫోన్‌లో హిడెన్ కెమెరాలను గుర్తించే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేసినట్లు సమాచారం.

గోడలు, లగేజీ.. ఎక్కడ చూసినా కెమెరాలే?

ఇంటిని పరిశీలించే సమయంలో దాదాపు 13 రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆమె వెల్లడించినట్లు సమాచారం. వాటిని ఇంటి గోడల లోపల, లగేజీతో పాటు ఇతర ప్రదేశాల్లో అమర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు తెలియకుండా ఇంత పెద్ద సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేయడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెబుతున్నారు. తమతో కలిసి ఉంటున్న వ్యక్తులే ఇలా చేశారనే అనుమానం రావడంతో కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు సమాచారం. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబంలో ఇంటి లోపలే ప్రైవసీకి భంగం కలగడం మరింత కలవరపెట్టే అంశంగా మారింది.

మానసికంగా తీవ్ర ప్రభావం

ఈ ఘటన తర్వాత ఆ మహిళ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. తనకు ఎదురైన అనుభవం కారణంగా తాను తీవ్రంగా కుంగిపోయానని, ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చినట్లు ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం మానసికంగా కోలుకునేందుకు సుమారు 40 రోజుల పాటు భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

అమెరికాలో ఉన్న తెలుగు కుటుంబాలకు కీలక హెచ్చరిక

అమెరికాలో ఇతరులతో కలిసి ఇళ్లు షేర్ చేసుకునే కుటుంబాలకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరికగా చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు, పిల్లలు కలిసి నివసించే సమయంలో ఇంటి ప్రైవసీ, భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇంటికి మారినప్పుడు బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, డ్రెస్సింగ్ ఏరియాలు, స్మార్ట్ డివైజ్‌లు, అనుమానాస్పద వస్తువులు వంటి వాటిని ఒకసారి పరిశీలించడం మంచిది. అనుమానాస్పద కెమెరా లేదా రికార్డింగ్ పరికరం కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే స్థానిక పోలీసులను సంప్రదించాలి.

స్నేహితులైనా, పరిచయస్తులైనా.. ఇంటి ప్రైవసీ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు, బాధ్యులపై అధికారిక దర్యాప్తు లేదా చట్టపరమైన చర్యల వివరాలు ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.