అమెరికాలో ఘోరం.. నింగికెగసిన మరో తెలంగాణ తేజం..
సుదూర తీరాలకు వెళ్తే భవిష్యత్తు బంగారు మయమవుతుందని.. కన్నవారి కలలు నిజం చేయవచ్చని ఆశించిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి.
By: A.N.Kumar | 5 Oct 2026 12:28 AM ISTసుదూర తీరాలకు వెళ్తే భవిష్యత్తు బంగారు మయమవుతుందని.. కన్నవారి కలలు నిజం చేయవచ్చని ఆశించిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. కంటికి రెప్పలా చూసుకున్న కూతురు విదేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడిందన్న కన్నవారి ఆనందం నిమిషాల్లో ఆవిరైపోయింది. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణకు చెందిన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ బలంగా ఢీకొనడంతో జరిగిన ఈ విషాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
కలల బాటలో పయనం.. చివరకు కాలకూట విషమై..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాంతానికి చెందిన దారం సుప్రియ (31) ఎంతో ప్రతిభావంతురాలు. ఉన్నత చదువు పూర్తయ్యాక అవకాశాల కోసం అమెరికాకు వెళ్లిన ఆమె మిస్సౌరీ రాష్ట్రంలో నివసిస్తూ ఉద్యోగం చేసుకుంటోంది. భర్తతో కలిసి ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి ప్రమాదం రూపంలో చావు ముంచుకొచ్చింది. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సుప్రియ తన స్నేహితురాలైన మరో భారతీయ యువతితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది.
రెప్పపాటులో ఆరిపోయిన దీపం
వారు ప్రయాణిస్తున్న కారు ప్రశాంతంగా సాగిపోతున్న వేళ.. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక భారీ ట్రక్, యముడిలా విరుచుకుపడింది. ఒక్కసారిగా కారును బలంగా ఢీకొట్టడంతో ఆ దృశ్యం వర్ణనాతీతంగా మారింది. ట్రక్ ధాటికి కారు పిండిపిండి అయిపోయింది. ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. సుప్రియ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మృత్యువు ఆమెను కన్నవారికి.. భర్తకు దూరం చేసి తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. కారులో ఉన్న మరో భారతీయ యువతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ కళ్లలో మిగిలిన కన్నీళ్లే.. మోడువారిన కుటుంబం
"మా బిడ్డ ఇక లేదన్న" వార్త మహబూబాబాద్‌లోని ఆమె స్వగ్రామానికి చేరగానే ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. కంటిపాపలా పెంచుకున్న కుమార్తె దేహం దూరంగా ఉందన్న నిజం తట్టుకోలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుప్రియ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె ఆఖరి చూపుకైనా దక్కాలంటూ ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం, విదేశాంగ శాఖ, తెలుగు సంఘాలు తక్షణమే సహాయం అందించాలని కుటుంబ సభ్యులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.
తెలుగు ఇళ్లల్లో తీరని శోకం
మరోవైపు ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా రోజురోజుకూ అమెరికాలో రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న తెలుగు యువత సంఖ్య పెరుగుతుండటం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది. కన్నవారిని, కట్టుకున్నవారిని వదిలి.. ఎక్కడో వేల మైళ్ల దూరంలో కష్టపడి పైకి వస్తున్న సుప్రియ లాంటి యువతుల జీవితాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో బుగ్గిపాలవ్వడం తీరని బాధను మిగుల్చుతోంది.
