Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో విషాదం... భారత గర్భిణీ మహిళ మృతి

సమన్వితకు మూడు ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం 8వ నెల గర్భవతి కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

By:  Ramesh Palla   |   19 Nov 2025 1:29 PM IST
ఆస్ట్రేలియాలో విషాదం... భారత గర్భిణీ మహిళ మృతి
X

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విషాదం చోటు చేసుకుంది. సిడ్నీ లోని హార్న్స్‌బీలో ఉండే జార్జ్‌ స్ట్రీట్‌లో ఈవినింగ్‌ వాకింగ్ కి వెళ్లిన ఇండియన్‌ కుటుంబం రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దాంతో మహిళ మృతి చెందింది. మృతి చెందిన సమన్విత ధనేశ్వర్‌ 8 నెలల గర్భిణి కావడంతో ఆ కుటుంబంలో మరింత విషాదం చోటు చేసుకుంది. సమన్వితకు మూడు ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం 8వ నెల గర్భవతి కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సమన్విత కుటుంబ సభ్యులు, ఇండియాలో ఉన్న ఆమె సన్నిహితులు దుఃఖంలో మునిగిపోయారు. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్‌ కారణంగా చిన్నాభిన్నం అయింది.

ఆస్ట్రేలియాలో యాక్సిడెంట్‌..

ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు చెబుతున్నారు. సమన్విత ధనేశ్వర్‌ వయసు 33 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది. ఆమె ఆస్ట్రేలియాలో ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తుంది. ఇండియా నుంచి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్లిన సమన్విత మృతి పట్ల స్థానిక ఎన్నారై సంఘాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహం ను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా స్థానిక ఎన్నారైలు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పుకొచ్చారు. గర్భంతో ఉన్న సమన్విత ధనేశ్వర్‌ ను ప్రమాదం జరిగిన వెంటనే వెస్ట్‌మీడ్‌ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ ఆమెను బ్రతికించేందుకు వైద్యులు చాలా కష్టపడ్డారని, కానీ వైద్యులు ఆమెను కానీ, ఆమె కడుపులో ఉన్న బిడ్డను కానీ బతికించలేక పోయారని కుటుంబ సన్నిహితులు, స్థానిక మీడియా వారు చెబుతున్నారు.

సమన్విత కుటుంబ సభ్యులతో..

సమన్విత కుటుంబ సభ్యులు రోడ్డు దాటుతున్న సమయంలో కియా కార్నివాల్‌ కారు నెమ్మదిగా వస్తోంది. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా నడిచారు, దాని వెనకాలే అత్యంత స్పీడ్‌గా వచ్చిన BMW సెడాన్‌ కారు సమన్వితను గుద్దినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెబుతున్నారు. BMW కారును 19 ఏళ్ల ఆరోన్‌ పాపాజోగ్లు అనే కుర్రాడు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు నడిపిన BMW కారును సీజ్‌ చేశారు. నిర్లక్ష్యంగా కారును నడిపినట్లు అతడిపై కేసు నమోదు చేయడం ద్వారా జైలుకు పంపించబోతున్నామని పోలీసులు పేర్కొన్నారు. తన డ్రైవింగ్‌ తో రెండు ప్రాణాలను తీసిన అతడికి కోర్ట్‌ కఠిన శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి అంటూ స్థానిక న్యాయవాదులు, అక్కడి చట్టాలు తెలిసిన వారు చెబుతున్నారు.

సిడ్నీలో ఇండియన్‌ ఫ్యామిలీ..

సమన్విత ఫ్యామిలీ ఇటీవలే సిడ్నీలోని గ్రాంథమ్‌ ఫామ్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి భూమి కొనుగోలు చేయడం జరిగిందట. కొన్ని వారాల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమన్విత ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోయింది. రెండో బిడ్డ పుట్టిన తర్వాత గ్రాంథమ్‌ ఫామ్‌ లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలని కుటుంబ సభ్యులు అనుకున్నారట. కానీ ఇంతలో ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమన్విత కుటుంబ సభ్యులకు మద్దతుగా స్థానిక ఎన్నారైలు, వారి కుటుంబ సభ్యులు అండగా నిలుస్తున్నారు. సమన్విత మృతి పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఇలా యాక్సిడెంట్స్‌ లో మృతి చెందుతున్న ఇండియన్స్ సంఖ్య ప్రతి ఏడాది పెరగడం ఆందోళన కలిగిస్తోంది.