అమెరికాలో భారతీయ విద్యార్థులపై మరో పిడుగు
ఈ చట్టం OPT (Optional Practical Training) , STEM OPT వీసాలపై పనిచేస్తున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న FICA (Federal Insurance Contributions Act) పన్ను మినహాయింపును రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది.
By: A.N.Kumar | 28 Oct 2025 1:20 PM ISTఅమెరికాలో ఉన్న భారత విద్యార్థులకు మరో కొత్త ఆర్థిక భారం పడే ప్రమాదం పొంచి ఉంది. సెనేటర్ టామ్ కాటన్ ప్రతిపాదించిన 'OPT ఫెయిర్ ట్యాక్స్ యాక్ట్ ’ అనే చట్టం ఆమోదం పొందితే.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వేలాది మంది విదేశీ విద్యార్థులపై, ముఖ్యంగా భారతీయులపై, తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చట్టం OPT (Optional Practical Training) , STEM OPT వీసాలపై పనిచేస్తున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న FICA (Federal Insurance Contributions Act) పన్ను మినహాయింపును రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది.
* OPT వీసా విద్యార్థులకు అదనపు పన్ను భారం
ప్రస్తుతం, FICA పన్ను నుంచి OPT విద్యార్థులకు మినహాయింపు ఉంది. ఈ పన్ను కింద ఉద్యోగులు.. యజమానులు మొత్తంగా 7.65% (6.2% సోషల్ సెక్యూరిటీకి + 1.45% మెడికేర్‌కి) చెల్లించాలి. కొత్త చట్టం ఆమోదం పొందితే OPT లేదా STEM OPT మీద పనిచేస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా తమ జీతంలో 7.65% పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా వారి వార్షిక ఆదాయం వేల డాలర్లు తగ్గిపోతుంది.
* అమెరికన్ కార్మికుల రక్షణ వర్సెస్ విద్యార్థుల ఆందోళన
ఈ ప్రతిపాదనను సెనేటర్ కాటన్ సమర్థిస్తూ పన్ను మినహాయింపును తొలగించడం ద్వారా అమెరికన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, అమెరికన్ కార్మికులను ప్రోత్సహించడం తమ పన్ను విధానం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. OPT వీసా విద్యార్థులకు సోషల్ సెక్యూరిటీ లేదా మెడికేర్ వంటి ప్రయోజనాలు పొందే హక్కు లేదు. ప్రయోజనాలు పొందని వారికి పన్ను విధించడం అన్యాయం అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మేము పొందలేని ప్రయోజనాల కోసం మా జీతం నుంచి 7.65% కోల్పోవడం అన్యాయం. ఇది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడంకన్నా మాపై అదనపు భారమే,” అని ఒక భారత విద్యార్థి స్పందించారు.
* భారత విద్యార్థులపై బహుముఖ ప్రభావం
అమెరికాలో OPT లేదా STEM OPT వీసాలతో పనిచేస్తున్న విద్యార్థులలో భారతీయుల సంఖ్యే అధికం. ఈ చట్టం ముఖ్యంగా వారిపై ఈ కింది విధంగా ప్రభావం చూపిస్తుంది. ప్రతి విద్యార్థి తమ వార్షిక ఆదాయంలో 7.65% కోల్పోవడం వల్ల వారి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. ఉద్యోగులు మరియు కంపెనీలు ఇద్దరూ FICA పన్ను చెల్లించాల్సి రావడం వల్ల, కంపెనీలు OPT విద్యార్థులను నియమించడంలో ఆసక్తి తగ్గించుకోవచ్చు. ఎందుకంటే, కంపెనీలకు కూడా ఇప్పుడు అదనపు పన్ను భారం పడుతుంది. అమెరికాలో ఉద్యోగం పొందడం మరింత కఠినతరం అవుతుంది.
* దీర్ఘకాలిక పరిణామాలు
అమెరికాలో విద్య ఖర్చులు ఇప్పటికే అత్యధికంగా ఉన్నాయి. OPT సమయంలో ఉద్యోగం ద్వారా కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావించే భారతీయ విద్యార్థులకు ఈ అదనపు పన్ను పెద్ద ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది.
దీర్ఘకాలంలో ఈ చట్టం ఆమోదం పొందితే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదన భారత విద్యార్థుల ఆర్థిక వ్యవస్థపై, అమెరికాలో వారి ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని భావించవచ్చు.
