గుండెపోటుతో తెలుగు ఎన్నారై అమెరికాలో మృతి.. భార్య విన్నపం ఇదే!
ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లిన పలువురు భారతీయులు రకరకాల కారణాలతో మృతి చెందడం వారి వారి కుటుంబాలను తీవ్ర దుఖసాగరంలో ముంచేస్తోంది
By: Raja Ch | 16 Nov 2025 11:32 AM ISTఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లిన పలువురు భారతీయులు రకరకాల కారణాలతో మృతి చెందడం వారి వారి కుటుంబాలను తీవ్ర దుఖసాగరంలో ముంచేస్తోంది. మరోవైపు.. గత కొంతకాలంగా గుండెపోటు కారణంగా పలువురు యువ ఎన్నారైలు ఆకస్మికంగా మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో మరో తెలుగు ఎన్నారై మృతి చెందారు.
అవును... మరో తెలుగు ఎన్నారై మృతి చెందారు. ఇందులో భాగంగా... విజయవాడకు చెందిన కార్మీక్ అరిశెట్టి (36) అమెరికాలో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. మరోవైపు, ఇటీవలే కార్తీక్ తన తండ్రిని కోల్పోయారు. ఈ సమయంలో తాజాగా కార్తీక్ కూడా మరణించడం అతని తల్లి, భార్యను తీవ్రంగా కుంగదీసింది.
కాగా... ఈ ఏడాది అక్టోబర్ లో యూఏఈఇలో ఇంజినీర్ గా పనిచేస్తున్న కేరళకు చెందిన హరిరాజ్ సుదేవన్ (37) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల రమణ్ దీప్ సింగ్ (40) కెనడాలో గుండెపోటుతో మరణించారు. ఇలా యువ ఎన్నారైలో విదేశాల్లో ఆకస్మిక గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
భార్య విన్నపం ఇదే!:
ఈ సందర్భంగా.. తన ప్రియమైన భర్త కార్తీక్ ఆకస్మికంగా మరణించడంతో తన ప్రపంచం ముక్కలైందని.. ఆయన నిజంగా సౌమ్య్యుడు, దయగల వ్యక్తి అని.. ఆయన కేవలం 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో తమ నుంచి దూరమయ్యారని కార్తీక్ భార్య పేర్కొన్నారు. తమకు మూడేళ్ల కుమార్తె ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలే కార్తీక్ తండ్రి మరణించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో కార్తీక్ ఒక్కరే తమ కుటుంబానికి ఏకైక సంపాదకుడని.. అలాంటి ఆయన మరణం తమకు ఆర్థిక అనిశ్చితిని మిగిల్చిందని తెలిపారు. ఈ దిగ్భ్రాంతికరమైన నష్టం తనకు, తన కుమార్తెకు, కార్తీక్ తల్లికి అపారమైన శూన్యతను సృష్టించిందని.. ఈ సమయంలో ఆర్థిక భారాలను అధిగమించడంతో మాకు సహాయం చేయడానికి మీ మద్దతు చాలా అవసరం అంటూ ఆమె 'గోఫండ్ మీ.కామ్' లో పేర్కొన్నారు!
