Begin typing your search above and press return to search.

ఇండియాలో కుటుంబానికి ఎమర్జెన్సీ.. ఈ ఎన్నారై కష్టాలు పగోడికి రావద్దు

ఈ పరిస్థితి ప్రాణాపాయంగా కాకపోయినా.. రోజులు వేచి ఉండే పరిస్థితి మాత్రం లేదని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్ కు డబ్బులు పంపే బ్యాంకింగ్ యాప్ ను తెరిచి ట్రాణ్ ఫర్ చేయడానికి ప్రయత్నించారు.

By:  A.N.Kumar   |   21 Dec 2025 11:11 AM IST
ఇండియాలో కుటుంబానికి ఎమర్జెన్సీ.. ఈ ఎన్నారై కష్టాలు పగోడికి రావద్దు
X

కుటుంబంలో అనుకోని ఆరోగ్య సమస్య వస్తే ఆ క్షణాలు ఎంతో విలువైనవి. ఎక్కడ ఏమాత్రం లేట్ అయినా ప్రాణాలకే ప్రమాదం. అయితే అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత చెత్తగా ఉంటుంది? ఇండియతో పోలిస్తే ఎంత అధమంగా ఉంటుందో తెలిపే ఒక ఘటన ప్రవాస భారతీయులకు కనువిప్పు కలిగిస్తోంది.

ఇటీవల తన కుటుంబానికి ఎమర్జెన్సీ వచ్చిన పరిస్థితుల్లో ఒక ఎన్ఆర్ఐకి అమెరికా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థతో రెండు గంటల పోరాటం సాగింది. ఈ సంఘటన అత్యవసర సమయాల్లో మనం ఎంతవరకూ సిద్ధంగా ఉన్నామన్న దానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది.

ఒక్క ఫోన్ కాల్ తో మారిన ఉదయం..

అమెరికాలోని చికాగోలో నివసిస్తున్న ఓ ఎన్ఆర్ఐ ఈ అనుభవాన్ని రెడిట్ లో పంచుకున్నారు. ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తండ్రికి అత్యవసర వైద్యపరీక్షలు అవసరమని ఆస్పత్రి ముందుగా డబ్బులు చెల్లించాలని చెప్పిందని తెలిపారు.

ప్రాణాపాయం కాదు.. కానీ ఆలస్యం కూడా కుదరదు..

ఈ పరిస్థితి ప్రాణాపాయంగా కాకపోయినా.. రోజులు వేచి ఉండే పరిస్థితి మాత్రం లేదని ఆయన చెప్పారు. సాధారణంగా భారత్ కు డబ్బులు పంపే బ్యాంకింగ్ యాప్ ను తెరిచి ట్రాణ్ ఫర్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ యాప్ లో డబ్బులు చేరడానికి మూడు నుంచి ఐదు పనిరోజుల సమయం పడుతుందని చూపించింది. అత్యవసర పరిస్థితిలో ఇది పూర్తిగా పనికిరాని ఆప్షన్. వెంటనే ఇతర మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లను ప్రయత్నించాడు. కొన్ని యాప్ లు అయితే మళ్లీ ఖాతా వెరిఫికేషన్ కోరాయి. అది పూర్తవ్వడానికి రోజులు పడుతుందని చెప్పారు. ఇంకొక యాప్ కార్డును ఎలాంటి కారణం లేకుండా తిరస్కరించింది. మరికొన్ని యాప్ లు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఈలోపు భారత్ నుంచి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ‘డబ్బులు పంపారా?’ అన్న ప్రశ్నలు ఒత్తిడిని మరింత పెంచాయి.

రెండు గంటల తర్వాత వచ్చిన ఊరట..

సుమారు రెండు గంటల ప్రయత్నాల తర్వాత చివరకు ట్రాన్స్ ఫర్ సక్సెస్ అయ్యింది. ఆసుపత్రి పరీక్షలను షెడ్యూల్ చేసింది. సమస్య తీరినా.. ఆ రెండుగంటల మానసిక ఒత్తిడి మాత్రం మిగిలిపోయింది. సాధారణంగా నిమిషాల్లో పూర్తవ్వాల్సిన పని.. తీవ్రమైన అనుభవంగా మారిందని ఆయన వాపోయారు.

ఇతర ఎన్ఆర్ఐలకు హెచ్చరిక

ఈ సంఘటన ఇతర ఎన్ఆర్ఐలకు ఒక స్పష్టమైన హెచ్చరిక. అత్యవసర సమయాల్లో డిజిటల్ సిస్టమ్ లు మనల్ని పూర్తిగా ఆదుకోకపోవచ్చు. అందుకే ముందుగానే పలు మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లలో యూఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు, భారత్ లోని కుటుంబ వివరాలను లింక్ చేసుకొని ఉంచుకోవాలని ఆయన సూచించారు.ఎప్పుడైనా అవసరం వస్తే.. పానిక్ కాకుండా ఉండాలంటే ముందస్తు సిద్ధతే అసలైన రక్షణ.