Begin typing your search above and press return to search.

డిజిటల్ కేవైసీ వేళ ఎన్నారైలకు తిప్పలు.. భారత్‌కు రాక తప్పదా?

విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐ) తమ భారతీయ బ్యాంక్ ఖాతాల నిర్వహణ ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశం.

By:  A.N.Kumar   |   25 Sept 2026 12:00 AM IST
డిజిటల్ కేవైసీ వేళ ఎన్నారైలకు తిప్పలు.. భారత్‌కు రాక తప్పదా?
X

విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐ) తమ భారతీయ బ్యాంక్ ఖాతాల నిర్వహణ ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అంశం. అయితే, ఇటీవల అమలులోకి వచ్చిన సెంట్రల్ కేవైసీ 2.0 విధానం కారణంగా చాలా మంది ఎన్నారైలు ముఖ్యంగా ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతాల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి వస్తున్న రీ-వెరిఫికేషన్ మెయిల్స్, సందేశాలు వారిలో ఆందోళన పెంచుతున్నాయి. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖాతా లావాదేవీల నిలిపివేత ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి.

2026 ఆగస్టు నుంచి బ్యాంకులు , బీమా సంస్థలు సీకేవైసీ 2.0ను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించాయి. కస్టమర్ అనుమతితో సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ నుంచి ఇప్పటికే ఉన్న ధృవీకరించిన వివరాలను ఆర్థిక సంస్థలు నేరుగా పొందేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించారు. పదేపదే పత్రాలు సమర్పించే అవసరాన్ని తగ్గించి.. డిజిటల్ పద్ధతిలో కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ.. విదేశాల్లో ఉండే ఎన్నారైల విషయానికి వచ్చేసరికి ఈ డిజిటల్ విధానం కొన్ని ప్రాక్టికల్ సమస్యలను సృష్టిస్తోంది.

ముఖ్యంగా విదేశాల్లో నివసించే భారతీయులకు భారతీయ మొబైల్ నంబర్లు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల డిజిటల్ వెరిఫికేషన్‌కు అవసరమైన ఓటీపీ అందకపోవడం ప్రధాన ప్రతిబంధకంగా మారింది. అంతేకాకుండా విదేశీ ఐపీ (ఐపీ) అడ్రస్‌ల నుంచి బ్యాంక్ వెబ్‌సైట్లు లేదా యాప్‌లను యాక్సెస్ చేసేటప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. సమస్య పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు.. కొన్ని బ్యాంకులు భారత్‌లోని బ్రాంచ్‌ను వ్యక్తిగతంగా సందర్శించాలని లేదా పాస్‌పోర్ట్, వీసా, విదేశీ చిరునామా ధ్రువీకరణ పత్రాల నోటరీ కాపీలు సమర్పించాలని సూచిస్తున్నట్లు ఆన్‌లైన్ ఫోరమ్‌లలో ఎన్నారైలు పేర్కొంటున్నారు.

ఇదే సమయంలో ఎన్నారైలకు డిజిటల్ కేవైసీ ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొన్ని కీలక మార్పులు చేసింది. 2025 డిసెంబర్‌లో సెమీ, ఎన్నారైలు రీ-కేవైసీ లేదా కేవైసీ మార్పుల కోసం డిజిటల్ విధానాన్ని ఉపయోగించే సమయంలో భారత్‌లో భౌతికంగా ఉండాల్సిన నిబంధనను సడలించింది. అలాగే 2026 ఆగస్టు 14న కూడా ఎన్నారైలు, ఓసీఐలు, విదేశీ పౌరుల కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేసే చర్యలను ప్రకటించింది.

అయితే సెమీ పరిధిలోని సెక్యూరిటీస్ మార్కెట్ కేవైసీ నిబంధనలు.. బ్యాంకింగ్ ఖాతాల కేవైసీ ప్రక్రియ ఒకటే కావు. కాబట్టి ఎన్ఆర్ఈ/ఎన్.ఆర్ఓ ఖాతాదారులు తమ బ్యాంకు నుంచి వచ్చిన సందేశాలను నిర్లక్ష్యం చేయకుండా.. అధికారిక బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా రీ-కేవైసీ అవసరాన్ని ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులు తమ డిజిటల్ వ్యవస్థలను ఎన్నారైల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరిచి.. విదేశీ నంబర్లకు ఓటీపీ పంపే సదుపాయం కల్పిస్తే తప్ప ఈ సమస్యలకు పూర్తి పరిష్కారం దొరకదు. అప్పటి వరకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే పవర్ ఆఫ్ అటార్నీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం.