భర్త ఇంటి పనులు చేయలేదని కత్తితో దాడి చేసిన భార్య.. అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్ట్
గృహకలహం తీవ్రరూపం దాల్చి భర్తపై కత్తితో దాడి చేసిన ఘటన అమెరికాలోని నార్త్ కరోలైనాలో కలకలం రేపింది.
By: A.N.Kumar | 27 Oct 2025 10:32 AM ISTగృహకలహం తీవ్రరూపం దాల్చి భర్తపై కత్తితో దాడి చేసిన ఘటన అమెరికాలోని నార్త్ కరోలైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన చంద్రప్రభా సింగ్ (44) ను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్లెట్ నగరంలోని బాలంటైన్ ప్రాంతంలో నివసిస్తున్న చంద్రప్రభా సింగ్ తన భర్త అర్వింద్ సింగ్‌పై అక్టోబర్ 12న కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి పనుల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన గొడవ ఈ ఘర్షణకు దారితీసింది. దాడిలో అర్వింద్ సింగ్ మెడకు గాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితురాలు
చంద్రప్రభా సింగ్ నార్త్ కరోలైనాలోని ఎండ్‌హేవెన్ ఎలిమెంటరీ స్కూల్‌లో K-3 తరగతులకు టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమెపై 'అసాల్ట్ విత్ ఎ డెడ్‌లీ వెపన్ ఇన్‌ఫ్లిక్టింగ్ సీరియస్ ఇంజరీ' అనే కేసు నమోదు చేయబడింది.
పోలీసుల దర్యాప్తులో చంద్రప్రభా సింగ్ తన వివరణ ఇచ్చారు. ఆ రోజు ఉదయం తాను బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేస్తుండగా, భర్త ఇంటి శుభ్రత గురించి ప్రశ్నించాడని తెలిపారు. ఆ సమయంలో కోపంతో తిరగబడి కత్తి చేతిలో ఉండటంతో పొరపాటున అతనికి గాయమైందని ఆమె చెప్పారు. అయితే, భర్త అర్వింద్ సింగ్ మాత్రం ఆమె ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చార్లెట్-మెక్లెన్‌బర్గ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ దాడి పాఠశాల ప్రాంగణంలో జరగలేదని స్పష్టం చేసింది. సంఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులు ఉదయం 10.49 గంటలకు అక్కడికి చేరుకున్నారు.
బెయిల్‌పై విడుదల
మొదట మేజిస్ట్రేట్ చంద్రప్రభా సింగ్‌కు బెయిల్ నిరాకరించినప్పటికీ, తదుపరి కోర్టు అక్టోబర్ 13న ఆమెకు $10,000 బాండ్‌పై విడుదలకు అనుమతించింది. అదే సమయంలో ఆమెకు పబ్లిక్ డిఫెండర్‌ను నియమించారు. ప్రస్తుతం ఆమె ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పరికరం ధరించి, భర్త అర్వింద్ సింగ్‌తో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని కోర్టు షరతు విధించింది.
