Begin typing your search above and press return to search.

తన పిల్లలను తానే హత్య చేసిందని.. అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్ట్!

అవును... తన పిల్లలను హత్య చేసిందనే అభియోగాలతో అమెరికాలోని న్యూజెర్సీలో గల హిల్స్ బరోకు చెందిన 35 ఏళ్ల భారత సంతతి మహిళ ప్రియథర్శిని నటరాజన్‌ ను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By:  Raja Ch   |   16 Jan 2026 1:00 AM IST
తన పిల్లలను తానే హత్య చేసిందని.. అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్ట్!
X

పాము తాను పెట్టిన గుడ్లనే అదే పొడుచుకుని తింటుందని అంటారు! అది దాని సహజనైజం కావొచ్చు కానీ.. పిల్లలను కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన ఓ తల్లి.. ఇద్దరినీ హత్య చేసిందనే అభియోగాలు మోపబడటంతో.. అమెరికాలోని న్యూజెర్సీలో ఓ భారత సంతతి మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఆ ఇద్దరు పిల్లల తండ్రి, ఈమె భర్త కావడం గమనార్హం. ఈ కేసు భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది.

అవును... తన పిల్లలను హత్య చేసిందనే అభియోగాలతో అమెరికాలోని న్యూజెర్సీలో గల హిల్స్ బరోకు చెందిన 35 ఏళ్ల భారత సంతతి మహిళ ప్రియథర్శిని నటరాజన్‌ ను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన సోమర్ సెట్ కౌంటీ ప్రాసిక్యూటర్ జాన్ మెక్ డొనాల్డ్... జనవరి 13న సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో.. పిల్లల తండ్రిగా భావిస్తున్న ఒక వ్యక్తి 911కు కాల్ చేశాడని తెలిపారని.. ఈ సందర్భంగా తాను ఇంటికి వచ్చేటప్పటికి కనిపించిన ఘటన గురించి వివరించాడని అన్నారు.

ఇందులో భాగంగా... తాను ఆఫీస్‌ నుంచి వచ్చేసరికి తమ 5, 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు అనుమానాస్పద రీతిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని తెలిపాడు. వారిని తన భార్యే ఏదో చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాల్ చేసిన నటరాజన్ తో పాటు ప్రియదర్శినిని గుర్తించారు. ఇదే సమయంలో.. బెడ్ రూమ్ లో ఇద్దరు చిన్నారులు పడి ఉండటాన్ని గుర్తించారు.

వెంటనే పిల్లలు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్ర్వీకరించారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో... ఇద్దరు పిల్లల మరణానికి వారి తల్లే కారణమని తేలడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమెపై రెండు ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగాలు.. ఆయుధాన్ని కలిగి ఉన్న నేరం కింద అభియోగాలు మోపారు. ఆమెను సోమర్‌ సెట్ కౌంటీ జైలుకు తరలించారు. మరోవైపు... చిన్నారుల మరణానికి గల కారణాలను గుర్తించడానికి నార్తర్న్ రీజినల్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.