ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్మార్గం.. ఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కేళ్లారు.. కూతురి ఆర్తనాదాలు వైరల్
అమెరికాలోని సియాటెల్ విమానాశ్రయంలో ఐసీఈ అధికారులు ఓ తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. తమ వీసా గడువు ముగిసినందున రికార్డో లరాండో మెన్డోజా, సోఫియా హెర్నాండెజ్ మెజియాను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కుమార్తెకు చెల్లుబాటయ్యే వర్క్ పర్మిట్ ఉందంటూ తల్లి వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By: A.N.Kumar | 22 Nov 2026 5:04 PM ISTఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణానికి సిద్ధమైన ఆ తల్లికి.. విమానాశ్రయంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. మరికొద్ది నిమిషాల్లో విమానం ఎక్కి గమ్యస్థానానికి చేరుకుంటామనుకున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చేసిన హఠాత్తు చర్య ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కళ్ల ముందే తన కుమార్తెను అధికారులు బలవంతంగా లాక్కెళ్తుంటే ఆ తల్లి పెట్టిన ఆర్తనాదాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తున్నాయి. అమెరికాలోని సియాటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేస్తోంది.
థ్యాంక్స్‌గివింగ్ సెలవుల నేపథ్యంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన సియాటెల్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన జరిగింది. లాస్‌ఏంజెలెస్‌కు వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేందుకు ప్రయాణికులు జెట్ బ్రిడ్జిపై వేచి ఉన్నారు. అంతా ప్రశాంతంగా సాగుతున్న వేళ ముసుగులు ధరించి ఎలాంటి గుర్తింపు చిహ్నాలు లేని సాధారణ దుస్తుల్లో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు అక్కడికి దూసుకొచ్చారు.
ప్రయాణికులందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని బలవంతంగా నేలపైకి తోసి ఈడ్చుకెళ్లడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. ఆ సమయంలో తన కుమార్తెను కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. "నా కూతురిని వదిలేయండి.. ఆమెకు చెల్లుబాటయ్యే వర్క్ పర్మిట్ ఉంది" అంటూ ఆ తల్లి చేసిన ఆర్తనాదాలు విమానాశ్రయంలో ప్రతిధ్వనించాయి. కళ్ల ముందే కన్నబిడ్డను లాక్కెళ్తుంటే ఆపలేక ఆ తల్లి పడిన ఆవేదనను చూసి తోటి ప్రయాణికులు.. విమాన సిబ్బంది సైతం చలించిపోయారు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీఈ అధికారులు స్పందించారు. మెక్సికోకు చెందిన రికార్డో లరాండో మెన్డోజా, సోఫియా హెర్నాండెజ్ మెజియా అనే ఇద్దరి వీసా గడువు ముగిసినప్పటికీ వారు చట్టవిరుద్ధంగా అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా అరెస్టు సమయంలో సోఫియా తమ అధికారులపై వేడి కాఫీ విసిరారని.. ఫెడరల్ అధికారిపై దాడి చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు విమాన బోర్డింగ్ సమయంలో తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఇలా వ్యవహరించడంపై అలాస్కా ఎయిర్‌లైన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సెలవుల రద్దీ సమయంలో ఈ ఘటన ప్రయాణికులను.. తమ సిబ్బందిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పేర్కొంది. పోర్ట్ ఆఫ్ సియాటెల్ అధికారులు సైతం బాధిత కుటుంబానికి.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయంపై ఫెడరల్ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
దేశ భద్రత, ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అధికారుల బాధ్యతే కావచ్చు. కానీ ఆ చట్టాలను అమలు చేసే తీరులో కనీస మానవీయత లేకపోవడం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. పదుల సంఖ్యలో ప్రయాణికుల మధ్య కుటుంబ సభ్యుల కళ్ల ముందే నేరస్థుల్లా ఈడ్చుకెళ్లడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి ఘటనలు ఆ కుటుంబ సభ్యులపై.. ముఖ్యంగా కళ్ల ముందే ఆ దృశ్యాలను చూసిన వారిపై జీవితాంతం చెరగని మానసిక గాయాన్ని మిగులుస్తాయి. చట్టం తన పని తాను చేసుకుపోయినా.. మనుషుల భావోద్వేగాలను గౌరవించేలా అధికారుల తీరు ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ తల్లి కన్నీళ్లు.. ఆర్తనాదాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని కఠినత్వానికి నిదర్శనంగా నిలిచాయి.
