Begin typing your search above and press return to search.

అమెరికాలో విషాదం.. మంచిర్యాల తల్లీకూతురు దుర్మరణం

అమెరికా గడ్డపై తెలుగు కుటుంబానికి తీరని విషాదం నిండింది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లి, కుమార్తె ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

By:  A.N.Kumar   |   18 Oct 2025 10:51 PM IST
అమెరికాలో విషాదం.. మంచిర్యాల తల్లీకూతురు దుర్మరణం
X

అమెరికా గడ్డపై తెలుగు కుటుంబానికి తీరని విషాదం నిండింది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన తల్లి, కుమార్తె ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరి మృతితో స్వగ్రామం మంచిర్యాల రెడ్డి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీ నివాసి, సింగరేణి సంస్థలో పనిచేసి విశ్రాంతి తీసుకున్న పి. విఘ్నేష్ కుటుంబం ఈ దుర్ఘటనకు గురైంది. విఘ్నేష్ కుమార్తెలు స్రవంతి , తేజస్వి ఇద్దరూ వివాహానంతరం అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె తేజస్వి గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా గత నెల సెప్టెంబరు 18న విఘ్నేష్, ఆయన భార్య రమాదేవి (55) అమెరికాకు వెళ్లారు.

శుక్రవారం నాడు పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు నిశాంత్ జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొన్నారు. వేడుక ముగిసిన అనంతరం, శనివారం ఉదయం వారు తమ స్వస్థలానికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారును అదుపుతప్పిన టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది.

తల్లి, కుమార్తె అక్కడికక్కడే మృతి

ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదంలో పి. విఘ్నేష్ భార్య రమాదేవి (55), చిన్న కుమార్తె తేజస్వి (30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అయింది. విఘ్నేష్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో బయటపడినట్టు సమాచారం. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ వార్త మంచిర్యాలలోని వారి బంధుమిత్రులు, స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది. ఆనందంగా అమెరికా పర్యటనకు వెళ్లిన కుటుంబంలో అకస్మాత్తుగా ఈ విషాదం చోటు చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

స్వదేశానికి మృతదేహాల తరలింపు ఏర్పాట్లు

మృతి చెందిన రమాదేవి, తేజస్వి మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు.. బంధువులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అమెరికాలోని భారత కాన్సులేట్ సహాయం తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలు స్వదేశానికి చేరిన తర్వాత మంచిర్యాలలో అంత్యక్రియలు జరుపనున్నారు. మంచిర్యాల స్థానికులు, స్నేహితులు ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.