Begin typing your search above and press return to search.

అమెరికాలో హైదరాబాదీని వెంటాడిన మృత్యువు

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

By:  A.N.Kumar   |   13 Sept 2025 1:11 PM IST
అమెరికాలో హైదరాబాదీని వెంటాడిన మృత్యువు
X

అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన 20 ఏళ్ల మహమ్మద్ జాహిద్, ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

ఈ దుర్ఘటన సెప్టెంబర్ 7న జరిగింది. బ్రిడ్జ్‌పోర్ట్ యూనివర్సిటీలో హెల్త్ ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న జాహిద్, కాలేజీ నుండి తన గదికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ జాహిద్‌ను వెంటనే హార్ట్‌ఫోర్డ్ హెల్త్‌కేర్‌లోని సెయింట్ విన్సెంట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స పొందినప్పటికీ, అతని పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూశాడు.

ప్రభుత్వ జోక్యం కోసం అభ్యర్థన

ఈ విషాద ఘటనపై మజ్లిస్ బచావత్ తహ్రీక్ (MBT) నాయకుడు అంజదుల్లా ఖాన్ స్పందించారు. జాహిద్ మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్‌కు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, వాషింగ్టన్ ఎంబసీ , న్యూయార్క్ కాన్సులేట్ నుండి సరైన స్పందన రాకపోవడంతో, జాహిద్ తల్లిదండ్రులకు తాత్కాలిక వీసా మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.

కుటుంబంలో తీవ్ర విషాదం

జాహిద్ మృతి వార్త ఓల్డ్ మలక్‌పేట్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఇంత త్వరగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం, అధికారులు వారికి అండగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.