Begin typing your search above and press return to search.

ప్రియ నేస్తం కోసం మోడీ ఏం చేశారంటే ?

నరేంద్ర మోడీ భారత్ కి తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఇక రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎదురులేని నాయకుడిగా దశాబ్దాల నుంచి ఉన్నారు.

By:  Satya P   |   4 Dec 2025 11:35 PM IST
ప్రియ నేస్తం కోసం మోడీ ఏం చేశారంటే ?
X

నరేంద్ర మోడీ భారత్ కి తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఇక రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎదురులేని నాయకుడిగా దశాబ్దాల నుంచి ఉన్నారు. వీటిని మించి భారత్ రష్యాల మధ్య ఎనభై ఏళ్ళ అనుబంధం ఉంది. స్నేహ బంధానికి ప్రపంచంలో అసలైన నిర్వచనం చెప్పాలీ అంటే ఈ రెండు దేశాల గురించే మొదట ప్రస్తావించాలి. అంతలా నమ్మకానికి ప్రతిరూపంగా సాగుతున్న ఈ రెండు దేశాల స్నేహం ఇప్పటికీ వర్ధిల్లుతుంది అన్నది అందరి మాట. ఇక పుతిన్ మోడీల మధ్య కూడా అంతకు మించి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి. సరిగ్గా నెలన్నర క్రితం చైనాకు వెళ్ళిన మోడీ అక్కడ సదస్సులో పాల్గొన్న పుతిన్ ఇద్దరూ కలసి ఎంతలా కలసి మెలసి ఉన్నారో వీడియోల ద్వారా లోకం మొత్తం చూసింది. ఒకే కారులో ఈ ఇద్దరు నేతలు ప్రయాణించిన విజువల్స్ కూడా అందరికీ ఆకట్టుకున్నాయి.

ప్రియ నేస్తం కోసం :

ఇక అత్యంత ప్రియమైన నేస్తం భారత్ కి వస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారు అంటే అది షాకింగ్ పరిణామంగానే చూస్తున్నారు. ఏకంగా ప్రోటోకాల్ ని సైతం పక్కన పెట్టేసి మోడీ పాలం ఎయిర్ పోర్టులో పుతిన్ విమానం ల్యాండ్ కాగానే ఎదురెళ్ళారు. తన సెక్యూరిటీని సైతం పక్కన పెట్టేసి పుతిన్ కి ఘనంగా స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తమ మధ్య ఉన్న అవ్యాజమైన అనురాగం ఏమిటి అన్నది అలా మోడీ తన చర్యల ద్వారా తెలియచేశారు.

భారత్ కి ఫ్రెండ్ :

రష్యా అంటే అందరి నోటా ఒకే మాట. భారత్ కి బెస్ట్ ఫ్రెండ్ అని. కాలాలకు అతీతంగా నిలిచే బంధంగా కూడా చూస్తారు. ఏ దేశంతో అయినా అపోహలు ఉన్నాయి కానీ రష్యా విషయంలో అసలు లేవు. భారత్ సైతం రష్యా విషయంలో అదే పాటిస్తూ వచ్చింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం వేళ కూడా భారత్ ప్రపంచం అంతా ఒత్తిడి చేసినా తన స్టాండ్ తాను తీసుకుంది. అది రష్యాకి పరోక్షంగా అనుకూలంగా ఉండడమే విశేషం.

పాతికేళ్ళ స్నేహం :

ఇక మోడీ పుతిన్ ల మధ్య బంధం గత పదకొండేళ్ళుగా ఉంది అనుకుంటే పొరపాటే. 2001లోనే రష్యాకు గుజరాత్ సీఎం హోదాలో మోడీ వెళ్లారు. ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ తో కలసి రష్యా పర్యటన చేశారు మోడీ. ఆనాటి ఫోటోలు కూడా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా నాటి నుంచి నేటి దాకా ఇద్దరు మిత్రుల మధ్య చెక్కు చెదరని మిత్ర బంధం ఉంది. దానికి ఉదాహరణగానే ప్రోటోకాల్ ని సైతం మోడీ పక్కన పెట్టేశారు అని అంటున్నారు.

ప్రపంచ నేతలుగా :

ఏక ధృవ ప్రపంచంగా సాగుతున్న ప్రపంచాన్ని రెండో వైపుగా తీసుకుని రావాలన్న తాపత్రయం తపన అనేక దేశాలలో కనిపిస్తోంది. అగ్ర రాజ్యంగా అమెరికా పెద్దన్న చేస్తున్న దూకుడు కానీ పెత్తనం కానీ సహించలేని వాతావరణం అంతటా ఉన్న వేళ కీలక పాత్రలో భారత్ రష్యా ఉన్నాయన్నది వాస్తవం. ఈ రెండు దేశాల ఆలోచనలు అంతర్జాతీయంగా పెను మార్పులకు దోహదం చేస్తాయని అంటున్నారు. భారత్ కి రష్యా అధినేత రావడంతో ప్రపంచం కూడా ఈ వైపునే చూస్తోంది. ఈ రెండు దేశాలు చేసే నిర్ణయాలు తీసుకునే తీర్మానాలు ప్రపంచ సరళిని ఏ విధంగా మారుస్తాయన్న ఉత్కంఠ అంతటా ఉంది. రానున్న రెండు రోజులలో భారత్ లో పుతిన్ మోడీ సమావేశాలు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా సాగుతాయని అంటున్నారు.