Begin typing your search above and press return to search.

లండన్ లో తెలుగు యువకుడు మృతి... కారణం ఇదే!

అవును... ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి రకరకాల కారణాలతో మృత్యువాత పడుతున్న ఘటన తాజాగా మరోకటి చోటు చేసుకుంది.

By:  Raja Ch   |   4 Oct 2025 4:15 PM IST
లండన్ లో తెలుగు యువకుడు మృతి... కారణం ఇదే!
X

ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ఇతర దేశాలకు వెళ్లిన పలువురు భారతీయులు రకరకాల కారణాలతో చిన్న వయసులోనే మృతి చెందుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే! ప్రమాదాలో, దాడులో, అనారోగ్య సమస్యలో.. కారణం ఏదైనా ఈ ఘటనలో దేశంలోని వారి వారి కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది.

అవును... ఉన్నత చదువుల కోసమో, ఉజ్వల భవిష్యత్తు కోసమో ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి రకరకాల కారణాలతో మృత్యువాత పడుతున్న ఘటన తాజాగా మరోకటి చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌ రెడ్డి (26) లండన్ లో గుండెపోటుతో మరణించాడు.

ఉన్నత చదువుల కోసమని రెండేళ్ల కిందట లండన్ వెళ్లిన మహేందర్ రెడ్డి.. అక్కడే పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి వర్క్‌ వీసా కూడా రావడంతో తమ కొడుకు సెటిల్‌ అయిపోయాడని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అయితే... ఇంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. అక్టోబర్‌ 3న మహేందర్‌ రెడ్డి గుండెపోటుతో మరణించాడు.

ఈ విషయాన్ని అతని స్నేహితులు అదే రోజు రాత్రి ఫోన్‌ చేసి మహేందర్‌ రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో... అతని తల్లితండ్రులు ఒక్కసారిగా కుదేలైపోయారు. ఈ సందర్భంగా.. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని సంతోషించేలోపే, అతడి మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా.. మహేందర్‌ రెడ్డి తండ్రి రమేశ్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షునిగా ఉన్నారు. మహేందర్‌ రెడ్డి మృతి పట్ల ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.