Begin typing your search above and press return to search.

యూకే నుంచి కూడా భారతీయులు ఔట్ యేనా?

ప్రస్తుతం యూకేలో గృహాల కొరత, వేతనాల తగ్గుదల, ప్రజా సేవలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.

By:  A.N.Kumar   |   15 Sept 2025 9:00 PM IST
యూకే నుంచి కూడా భారతీయులు ఔట్ యేనా?
X

లండన్‌ వీధులు గత వారం లక్షల మందితో కిటకిటలాడాయి. టామీ రాబిన్సన్‌ నేతృత్వంలో జరిగిన “యునైట్ ది కింగ్డమ్” ర్యాలీ ఒక సాధారణ నిరసనలా కనిపించినప్పటికీ.. లోతుగా చూస్తే అది వలస వ్యతిరేక భావజాలానికి పెద్ద వేదిక అయింది. ఇంగ్లాండ్‌ సంస్కృతి, గుర్తింపును కాపాడుకోవాలనే పేరుతో ప్రారంభమైన ఈ ర్యాలీ చివరికి వలసదారులపై నేరుగా దాడి చేసే ప్రసంగాలు, నినాదాలతో నిండి పోయింది.

*ఎందుకు ఇప్పుడే?

ప్రస్తుతం యూకేలో గృహాల కొరత, వేతనాల తగ్గుదల, ప్రజా సేవలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీనికి వలసలను కారణంగా చూపుతూ స్థానికుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టారు. నేరాల విషయంలోనూ వలసదారులపై ఆరోపణలు పెడుతూ భయాలను పెంచారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా దీనికి తోడైంది. రాజకీయ నాయకులు, రైట్‌–వింగ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ వాతావరణాన్ని ఉపయోగించుకుని రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేశారు.

* ప్రపంచవ్యాప్తంగా అదే ధోరణి

లండన్‌లో మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు నగరాల్లో వలస వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో “మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా” పేరిట భారీ ర్యాలీలు జరిగి మాస్‌ ఇమిగ్రేషన్‌ ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికాలో శరణార్థి శిబిరాలపై స్థానిక నిరసనలతో పాటు కఠిన సరిహద్దు విధానాల అమలు కోరుతూ పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఐరోపా దేశాల్లోని వార్సా, బెర్లిన్‌, డబ్లిన్‌లలో శరణార్థి శిబిరాల ఏర్పాట్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

* భారతీయులపై ప్రభావం

ఈ పరిస్థితుల్లో పశ్చిమ దేశాల్లో పనిచేస్తున్న లేదా చదువుతున్న భారతీయులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతి విద్వేష భావజాలం పెరగడం వల్ల భారతీయులు సులభంగా లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ఇళ్ల అద్దె, ఉద్యోగ అవకాశాలు, రోజువారీ జీవితంలో వివక్ష ఎదురయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా విదేశాలకు చదువుకోడానికి లేదా ఉద్యోగాల కోసం వెళ్లేవారికి స్థానిక మద్దతు తగ్గవచ్చు.

విదేశాంగపరంగా భారత ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తప్పవు. అవసరమైతే అడ్వైజరీలు జారీ చేయడం, రక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి అవుతుంది.

లండన్‌లో ర్యాలీ జరిగినా, దీని ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. వలస వ్యతిరేక వాతావరణం ఒక్క దేశానికే పరిమితం కాని స్థితిలో ఉంది. ఈ తరహా పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారత్‌ ప్రభుత్వం దౌత్యపరంగా మరింత చురుకుదనం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.