బిష్ణోయ్ గ్యాంగ్ దాడి.. కెనడాలో భారత పారిశ్రామికవేత్త హత్య.. కలకలం
ఇటీవల ఆ దేశంలో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి హత్యకు గురవడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది.
By: A.N.Kumar | 29 Oct 2025 11:44 AM ISTకెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు హద్దుమీరుతున్నాయి. ఇటీవల ఆ దేశంలో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సహాసి హత్యకు గురవడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణమైన హత్యను తామే చేశామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.
హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ అంగీకారం
బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ ధిల్లాన్ అనే సభ్యుడు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేస్తూ, హత్యకు గల కారణాలను వెల్లడించాడు. హత్యకు గురైన సహాసి మాదకద్రవ్యాల వ్యాపారంలో భాగమయ్యాడని ఆరోపించాడు. అతడి వద్ద నుంచి డబ్బు డిమాండ్ చేసినా ఇవ్వకపోవడంతోనే ఈ హత్య చేశామని స్పష్టం చేశాడు. ఈ ఘటన కెనడాలోని అబోట్స్‌ఫోర్డ్ ప్రాంతంలో సోమవారం జరిగింది.
* ఘటనా వివరాలు
66 ఏళ్ల దర్శన్ సింగ్ సహాసి తన ఇంటి వెలుపల ఉన్న కారు వద్దకు వెళ్తుండగా మరో కారులో దాగి ఉన్న దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో సహాసి అక్కడికక్కడే మరణించాడు. మొదట ఈ కేసు వ్యాపార సంబంధిత వివాదంగా భావించినా, బిష్ణోయ్ గ్యాంగ్ స్వయంగా బాధ్యత వహించడం దర్యాప్తునకు కొత్త మలుపు తీసుకొచ్చింది.
*సాధారణ ఉద్యోగి నుండి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా
1991లో సహాసి కెనడాకు వలస వెళ్లారు. తొలుత చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, నష్టాల్లో ఉన్న ఓ వస్త్ర యూనిట్‌లో వాటా కొనుగోలు చేసి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. కెనడాలో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న సహాసిని స్థానిక సమాజం గౌరవంగా చూసేది.
*పంజాబీ గాయకుడిపైనా కాల్పులు
ఈ ఘటనతో పాటు, ఇటీవల పంజాబీ గాయకుడు చాని నట్టన్ ఇంటి వెలుపల కూడా కాల్పులు జరిగాయి. ఈ దాడికి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. గోల్డీ ధిల్లాన్ తన పోస్టులో నట్టన్‌పై వ్యక్తిగత శత్రుత్వం లేదని, అయితే గాయకుడు సర్దార్ ఖేరా తో సాన్నిహిత్యం కారణంగా అతడిని లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించాడు. ఖేరాతో కలిసి పనిచేసే ఏ గాయకుడిని అయినా తాము లక్ష్యంగా చేసుకుంటామని కూడా హెచ్చరించాడు.
* ఉగ్రవాద సంస్థగా గుర్తింపు
భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్న బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఇటీవల ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ గ్యాంగ్ చర్యలు కెనడాలోని భారతీయ సమాజంలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి.
భద్రతపై ఆందోళన
దర్శన్ సింగ్ హత్యతో కెనడాలో స్థిరపడిన భారతీయుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. గ్యాంగ్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వలస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుండటం ఆ దేశ భద్రతా వ్యవస్థకు ఒక పెద్ద సవాల్‌గా మారింది.
