Begin typing your search above and press return to search.

అమెరికాలో దీపావళికి మనోళ్లు అంటించారు.. అమెరికన్లకు మండింది

అమెరికాలో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరంలో ఈసారి దీపావళి వేడుకలు వివాదానికి దారి తీశాయి.

By:  A.N.Kumar   |   22 Oct 2025 10:06 PM IST
అమెరికాలో దీపావళికి మనోళ్లు అంటించారు.. అమెరికన్లకు మండింది
X

అమెరికాలో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ నగరంలో ఈసారి దీపావళి వేడుకలు వివాదానికి దారి తీశాయి. ముఖ్యంగా ఇర్వింగ్‌లోని “ది బ్రిడ్జెస్ కమ్యూనిటీ” ప్రాంతంలో దీపావళి సందర్భంగా భారీగా పటాకులు కాల్చడంపై స్థానిక అమెరికన్ నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో ఆత్మపరిశీలనకు దారితీస్తోంది.

కమ్యూనిటీ పెద్దల విజ్ఞప్తి విఫలం

దీపావళికి ఒక వారం ముందు, డల్లాస్ నగరంలోని తెలుగు కమ్యూనిటీ పెద్దలు తమ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పండుగను సంస్కారం, జాగ్రత్తలతో జరుపుకోవాలని, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు లేదా పొరుగు అమెరికన్లకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. అయితే, పండుగ రాత్రి అనంతరం ఈ సూచనలు పెద్దగా ఫలించలేదని తేలింది.

నివాసితుల ఫిర్యాదులు

పండుగ రాత్రి తరువాత బ్రిడ్జెస్ కమ్యూనిటీ వాట్సాప్‌ గ్రూప్‌లో పటాకుల పేలుళ్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “క్లెమెంటైన్ వీధిలో ఎన్నో ఇళ్లు గంటల తరబడి పటాకులు పేలుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు పనికిరావా?” అని ఒక స్థానిక నివాసి ప్రశ్నించారు. మరొకరు "ఇది గ్రెనేడ్లు పేలుతున్నట్టుంది, రెండో రాత్రి వరుసగా ఇలా భయపెడుతున్నారు" అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యాయని నివాసితులు ఫిర్యాదు చేశారు.

యువత వాదనలు, ఆగ్రహం

పటాకులు కాల్చడాన్ని ప్రశ్నించగా, కొంతమంది తెలుగు యువకులు "అమెరికాలోనే ఇవి అమ్ముతుంటే మేము కొన్నందుకు తప్పా?" అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నిర్లక్ష్యపూరితమైన సమాధానం పొరుగువారిలో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

దీనికి తోడు, కొంతమంది తెలుగు సోషల్ మీడియా వినియోగదారులు ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ, "అమెరికా ముందుగా గన్ కల్చర్‌ను ఆపాలి. అది దీపావళి పటాకుల కంటే ప్రమాదకరం" అని వాదించారు.

కమ్యూనిటీ పెద్దల ఆందోళన

వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో, డల్లాస్‌లోని తెలుగు సంఘాల పెద్దలు తమ ప్రజల ప్రవర్తనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తన వల్ల అమెరికాలోని మొత్తం భారతీయ సమాజానికి చెడ్డ పేరు వస్తుంది,” అని వారు హెచ్చరిస్తున్నారు. స్థానిక అమెరికన్లలో ఉన్న అసహనం, గన్ కల్చర్ వంటి వాస్తవ పరిస్థితుల మధ్య ఇలాంటి చర్యలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

సందేశం స్పష్టం

దీపావళి పండుగ ఆనందానికి ప్రతీక అయినప్పటికీ, ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా, భయంగా మారితే ఆ ఉత్సవం తన అర్థాన్ని కోల్పోతుందని కమ్యూనిటీ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. “పండుగ ఆనందం అందరికీ పంచాలి. భయం కాదు, శబ్దం కాదు. మనం ఈ దేశంలో గౌరవంగా జీవించాలంటే ఇక్కడి చట్టాలు, పొరుగువారి మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంది,” అని వారి సందేశం. ఈ సంఘటన అమెరికాలో స్థిరపడుతున్న భారతీయ సమాజం తమ సాంస్కృతిక వేడుకలను స్థానిక వాతావరణానికి అనుగుణంగా జరుపుకునే విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.