అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు కేసులో భారతీయ యువకుడికి 15 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలో అక్రమ వలసల వ్యవహారం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.
By: A.N.Kumar | 15 May 2026 1:01 PM ISTఅమెరికాలో అక్రమ వలసల వ్యవహారం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రజలను చేరవేస్తున్న నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించిన ఒక భారతీయ యువకుడు పట్టుబడటం.. అతనికి ఏకంగా 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికా-కెనడా సరిహద్దులో భారీ మానవ రవాణా రాకెట్
అమెరికా సరిహద్దుల్లో మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న కేసులో భారత్‌కు చెందిన శివమ్ (22) అనే యువకుడు దోషిగా తేలాడు. అమెరికా న్యాయశాఖ అందించిన అధికారిక సమాచారం ప్రకారం.. శివమ్ అమెరికా - కెనడా సరిహద్దు మార్గాల ద్వారా వలసదారులను రహస్యంగా దేశంలోకి ప్రవేశపెట్టే భారీ నెట్‌వర్క్‌కు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు. 2024 అక్టోబర్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో ఇతడు డజన్ల కొద్దీ అక్రమ రవాణా ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆపరేషన్ ప్లాన్.. స్టాష్ హౌస్‌ల నుంచి హోటళ్ల వరకు..
శివమ్ కేవలం ఒక మధ్యవర్తిగా కాకుండా ఒక వ్యవస్థీకృత నేరగాడిగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. కెనడా నుంచి సరిహద్దు దాటి వచ్చిన వలసదారులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఇతడు ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించుకున్నాడు. సరిహద్దు దాటిన వెంటనే వలసదారులను న్యూయార్క్ ఉత్తర ప్రాంతాల్లోని రహస్య నివాసాలు లేదా ప్లాట్స్‌బర్గ్‌లోని హోటళ్లలో ఉంచి.. ఆపై వారిని గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఒక్కో వలసదారుడిని తరలించినందుకు డ్రైవర్లకు 100 డాలర్ల చొప్పున కమిషన్లు ఇస్తూ ఈ మొత్తం ఆపరేషన్‌ను తన కనుసన్నల్లో నడిపినట్లు కోర్టు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
చేజింగ్ సీన్.. పోలీసులకు చిక్కిన వలసదారులు
ఈ నెట్‌వర్క్ గుట్టు 2025 జనవరి 26న రట్టయ్యింది. అమెరికా బోర్డర్ పెట్రోల్ ఫోర్స్ నిశితంగా గమనిస్తున్న సమయంలో న్యూయార్క్‌లోని మూర్స్ ప్రాంతంలో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు వాహనాలను అధికారులు వెంబడించారు. ఈ క్రమంలో ఒక వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోగా రెండో వాహనాన్ని అధికారులు నిలువరించారు. ఆ వాహనాల్లో తనిఖీ చేయగా భారత్ - బ్రిటన్‌కు చెందిన 12 మంది అక్రమ వలసదారులు బయటపడ్డారు. వీరిని ప్రశ్నించిన క్రమంలోనే శివమ్ పేరు వెలుగులోకి వచ్చింది.
శిక్ష ఖరారు.. 15 ఏళ్ల జైలు గండం
దాదాపు ఏడాది కాలంగా సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం, మే 14న శివమ్ తన నేరాలను అంగీకరించాడు. అక్రమ వలసలకు కుట్ర, ఆర్థిక లాభం కోసం మానవ రవాణా చేయడం వంటి తీవ్రమైన మూడు అభియోగాలను కోర్టులో ఒప్పుకున్నాడు. అమెరికా చట్టాల ప్రకారం ఈ తరహా నేరాలకు కనీసం 5 ఏళ్ల తప్పనిసరి జైలు శిక్ష ఉంటుంది. అయితే శివమ్ నిర్వహించిన ఆపరేషన్ స్థాయిని బట్టి అతనికి గరిష్ఠంగా 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు సెప్టెంబర్ 4న వెలువడనుంది.
ట్రంప్ ప్రభుత్వ కఠిన నిర్ణయాల వేళ..
ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసల పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో పాటు అక్రమ మార్గాల్లో చొరబడే వారిని వారికి సహకరించే నెట్‌వర్క్‌లను ఏరివేసే పనిలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఒక భారతీయ యువకుడు ఈ స్థాయిలో అక్రమ రవాణాకు పాల్పడటం భారతీయుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొద్దిపాటి డబ్బు ఆశ చూపి యువతను ఇటువంటి నేరాల్లోకి లాగుతున్న అంతర్జాతీయ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
