Begin typing your search above and press return to search.

30 ఏళ్ల అమెరికా జీవితం.. గ్రీన్ కార్డ్ ఉన్నా ఐసీఈ అదుపులోకి భారతీయ మహిళ

30 ఏళ్ల నివాసం, చెల్లుబాటు అయ్యే గ్రీన్ కార్డ్, ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేని జీవితం... అయినా అమెరికాలో ఒక భారతీయ మహిళకు దక్కలేదు స్వేచ్ఛ

By:  A.N.Kumar   |   20 Aug 2026 12:19 PM IST
30 ఏళ్ల అమెరికా జీవితం.. గ్రీన్ కార్డ్ ఉన్నా ఐసీఈ అదుపులోకి భారతీయ మహిళ
X

30 ఏళ్ల నివాసం, చెల్లుబాటు అయ్యే గ్రీన్ కార్డ్, ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేని జీవితం... అయినా అమెరికాలో ఒక భారతీయ మహిళకు దక్కలేదు స్వేచ్ఛ.. ఇమ్మిగ్రేషన్ కోర్టు కేసు కొట్టివేసినా, రొటీన్ చెకప్ కోసం వెళ్లిన మహిళను ఐసీఈ అధికారులు అకస్మాత్తుగా డిటెన్షన్ సెంటర్‌కు తరలించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికాలో భారతీయుల భద్రత ఎండమావిగా మారింది.

అమెరికాలో దాదాపు మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. చెల్లుబాటు అయ్యే గ్రీన్ కార్డ్.. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోయినా అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

నార్త్ కరోలినాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న వెంకట వాసంశెట్టి.. సుమారు 30 ఏళ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. అక్కడ ఇల్లు కొనుగోలు చేసి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్నారు. ఆమె పిల్లలు, మనవళ్లు కూడా అమెరికా పౌరులే. అయితే ప్రస్తుతం ఆమె జార్జియాలోని ఒక ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నారు.

చిక్కు తెచ్చిపెట్టిన భారత్ పర్యటన

2022లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని పరామర్శించేందుకు వెంకట భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో కోవిడ్-19 సోకడంతో ఆమె ప్రయాణం ఆలస్యమైంది. సుమారు ఏడు నెలల తర్వాత 2023 ఫిబ్రవరిలో ఆమె తిరిగి అమెరికా చేరుకున్నారు. అయితే ఆరు నెలలకు పైగా విదేశాల్లో గడపడం వల్ల ఆమె తన పర్మినెంట్ రెసిడెంట్ (గ్రీన్ కార్డ్) హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారనే అనుమానంతో అధికారులు ఇమ్మిగ్రేషన్ తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు.

కోర్టు కేసు కొట్టివేసినా మళ్లీ అరెస్ట్

ఈ కేసులో కీలక పరిణామంగా 2026 మే నెలలో ఇమ్మిగ్రేషన్ జడ్జి వెంకటపై ఉన్న కేసును కొట్టివేశారు. ప్రభుత్వం నిర్ణీత సమయంలో తగిన ఆధారాలను సమర్పించలేకపోవడంతో కేసును మూసివేసి ఆమె లా ఫుల్ పర్మినెంట్ రెసిడెంట్ హోదాను సమర్థించారు.

కానీ ఊరట లభించిందనుకున్న కొద్ది నెలలకే మరో అనూహ్య పరిణామం ఎదురైంది. ఆరు రోజుల క్రితం అంటే ఆగస్టు 11న షార్లెట్‌లోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి రొటీన్ చెకప్ కోసం వెళ్లిన వెంకటను ఐసీఈ అధికారులు అకస్మాత్తుగా అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనలో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు

ఇప్పటికే కోర్టు కేసు కొట్టివేసిన తర్వాత కూడా ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటకు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ఆమెకు తక్షణ వైద్య సహాయం అవసరమని కుటుంబం వాపోతోంది. న్యాయవాదులు వెంటనే ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా.. కేసు పూర్తయ్యాక కూడా నిర్బంధించడానికి గల కారణాలను వివరించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ సంఘటన అమెరికాలోని భారతీయ కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దశాబ్దాల తరబడి అమెరికాలో ఉంటూ నిబంధనలు పాటిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఏ క్షణంలో ఎలాంటి చిక్కులు తెచ్చిపెడతాయోననడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ కేసులో ఫెడరల్ కోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చే వివరణపైనే వెంకట విడుదల ఆధారపడి ఉంది.