25 ఏళ్లలో తొలిసారి..! అమెరికాకు భారతీయుల రాక తగ్గుదల
దాదాపు పావు శతాబ్దం పాటు నిరంతరంగా పెరుగుతూ వచ్చిన భారతీయుల అమెరికా ప్రయాణాలకు ఈసారి బ్రేక్ పడింది.
By: A.N.Kumar | 1 Sept 2025 12:25 AM ISTదాదాపు పావు శతాబ్దం పాటు నిరంతరంగా పెరుగుతూ వచ్చిన భారతీయుల అమెరికా ప్రయాణాలకు ఈసారి బ్రేక్ పడింది. 2001 తర్వాత తొలిసారిగా అమెరికాకు వెళ్లే భారతీయ ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ పరిణామం పర్యాటక రంగ నిపుణులతో పాటు ఇరు దేశాల సంబంధాలపై ఆందోళనలను పెంచుతోంది.
-గణాంకాలు ఏం చెబుతున్నాయి?
అమెరికా వాణిజ్య శాఖకు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (NTTO) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జూన్ 2025లో కేవలం 2.1 లక్షల మంది భారతీయులు మాత్రమే అమెరికాను సందర్శించారు. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2.3 లక్షలుగా ఉండగా, ఈసారి దాదాపు 8% తగ్గుదల కనిపించింది. జులై 2025లో కూడా ఈ ధోరణి కొనసాగి, గత ఏడాదితో పోలిస్తే 5.5% తగ్గుదల నమోదైంది. ఇది కేవలం భారతీయుల విషయంలోనే కాదు, అమెరికాకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించింది.
- తగ్గుదలకు ప్రధాన కారణాలు
ఈ అసాధారణ తగ్గుదలకు నిపుణులు కొన్ని ముఖ్య కారణాలను వెల్లడిస్తున్నారు. అమెరికా వీసా విధానాలు మరింత కఠినతరం కావడంతో వీసా పొందడం భారతీయులకు సవాలుగా మారింది. వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యం, ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులను కలిసే వారికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. అమెరికా-భారత్ సంబంధాల్లో ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య ఏర్పడిన కొన్ని రాజకీయ ఉద్రిక్తతలు కూడా పరోక్షంగా ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నది విద్యార్థులు. అమెరికా యూనివర్సిటీలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల నమోదవడం గమనార్హం.
- అమెరికా పర్యాటక రంగంపై ప్రభావం
అమెరికా అంతర్జాతీయ పర్యాటక మార్కెట్‌లో భారత్ నాల్గో అతిపెద్ద సోర్స్‌గా ఉంది. మెక్సికో, కెనడా తర్వాత భారతీయులే ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న 50 లక్షల మంది భారతీయ వలసదారులు తమ బంధుమిత్రులను కలిసేందుకు తరచుగా చేసే ప్రయాణాలే ఈ స్థానానికి ప్రధాన కారణం. ఈ తగ్గుదల ధోరణి కొనసాగితే, అమెరికా పర్యాటక రంగానికి గణనీయమైన నష్టం వాటిల్లుతుందని ట్రావెల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-భారతీయుల ప్రయాణ అభిరుచులు
సాధారణంగా సెలవుల కోసం భారతీయులు ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, యూరప్ దేశాలను ఎక్కువగా ఎంచుకుంటారు. అమెరికా పర్యాటకానికి ద్వితీయ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సంబంధాల కోసం అమెరికా ఎప్పుడూ ప్రధాన గమ్యస్థానంగానే ఉంది. ప్రస్తుతం కనిపించిన ఈ తగ్గుదల తాత్కాలికమేనా లేదా ఒక కొత్త ధోరణికి సంకేతమా అనేది రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అయితే, ఈ తగ్గుదల భారతీయ ప్రయాణికుల అలవాట్లలో వస్తున్న మార్పులను సూచిస్తుందా? లేదా అమెరికా విధానాల ప్రభావమా? అనే చర్చ కొనసాగుతోంది.
