Begin typing your search above and press return to search.

అమెరికా వీసా... అడ్మిషన్ కంటే పెద్ద ఎగ్జామ్.. గెలిస్తే ప్రెసిడెంట్ అవార్డే!

అమెరికా వెళ్లాలి.. అక్కడ ఎంఎస్ చదవాలి, డాలర్లలో సంపాదించాలి... ఇది సగటు భారతీయ విద్యార్థి కల.

By:  A.N.Kumar   |   19 May 2026 10:42 AM IST
అమెరికా వీసా... అడ్మిషన్ కంటే పెద్ద ఎగ్జామ్.. గెలిస్తే ప్రెసిడెంట్ అవార్డే!
X

అమెరికా వెళ్లాలి.. అక్కడ ఎంఎస్ చదవాలి, డాలర్లలో సంపాదించాలి... ఇది సగటు భారతీయ విద్యార్థి కల. ఈ కల నిజం చేసుకోవడానికి ఒకప్పుడు జీఆర్ఈ రాయాలి.. టోఫెల్ లేదా ఐఈఎల్.టీఎస్ లో మంచి బ్యాండ్ స్కోర్ సాధించాలి.. యూనివర్సిటీలకు అప్లై చేసి ఎస్ఓపీలు రాసి ప్రాణాలు తోడాలి. కానీ ఇప్పుడు సీన్ మారింది బాసూ.. ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష జీఆర్ఈ కాదు.. యూనివర్సిటీ అడ్మిషన్ కూడా కాదు. అసలు మొగుడు “ఎఫ్-1 వీసా స్లాట్” దొరకడమే!

అవును మీరు విన్నది నిజమే. ఐవీ లీగ్ యూనివర్సిటీలో సీటు రావడం ఒక లెవల్ అయితే అమెరికా కాన్సులేట్ వెబ్‌సైట్‌లో వీసా అపాయింట్‌మెంట్ స్లాట్ పట్టుకోవడం అనేది నెక్స్ట్ లెవల్ గేమ్. ఇది కేవలం పరీక్ష కాదు... డిజిటల్ మహాభారత యుద్ధం!

ఈ పాటికే అడ్మిషన్లు వచ్చేసి వేల డాలర్ల ఫీజులు కట్టేసి.. సూట్‌కేసులు సర్దుకుంటున్న మన దేశీ స్టూడెంట్స్ ఇప్పుడు ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని తీవ్రమైన “రిఫ్రెష్ యజ్ఞం” చేస్తున్నారు. కీబోర్డ్‌పై ‘ఎఫ్5’ బటన్ అరిగిపోయేలా నొక్కుతున్నారు. ఒకప్పుడు అమెరికా వెళ్లేందుకు ప్రొఫెసర్ల రికమండేషన్ లెటర్ల కోసం తిరిగేవారు. ఇప్పుడైతే “స్లాట్ దొరికితే దేవుడికి 108 కొబ్బరికాయలు కొడతాం.. గుండు గీయించుకుంటాం” అని తిరుపతి వెంకన్నకు, చిలుకూరు బాలాజీకి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ కంటే వీసా అపాయింట్‌మెంట్ కన్ఫర్మేషన్ పేజీనే దేవుడి పటంగా చూసుకుంటున్నారు.

ప్రముఖ వీసా కన్సల్టెంట్ అతర్వ్ డే వెల్లడించిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం యుఎస్ కాన్సులేట్ భారీగా ఎఫ్-1 వీసా స్లాట్లను విడుదల చేసింది. అయితేనేం జూన్, జూలై నెలలకు సంబంధించిన ప్రైమ్ టైమ్ అపాయింట్‌మెంట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే మాయమైపోయాయి. మన ఊరిలో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్లు లేదా ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే స్పీడ్ కూడా దీని ముందు ఎందుకూ పనికిరాదని విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.

ఇక మే 17న జరిగిన ముచ్చట వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. పోర్టల్‌లో కొన్ని వీఏసీ బయోమెట్రిక్ స్లాట్లు మాత్రమే కనిపించాయట. కానీ వాటికి లింక్ అయి ఉండే కాన్సులర్ ఇంటర్వ్యూ తేదీలు మాత్రం అస్సలు ఓపెన్ కాలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి “జేబులో రైలు టికెట్ ఉంది కానీ, ప్లాట్‌ఫామ్ మీద రైలు లేదు” అన్నట్లుగా తయారైంది.

యూనివర్సిటీ రీసెర్చ్ పక్కనపెట్టి... సర్వర్ టైమింగ్స్ రీసెర్చ్!

ఇక అసలు కామెడీ ఏమిటంటే... విద్యార్థులు ఇప్పుడు తాము వెళ్లబోయే అమెరికా యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ల్యాబ్‌ల గురించి రీసెర్చ్ చేయడం మానేశారు. దానికి బదులు అమెరికా కాన్సులేట్ సర్వర్ల టైమింగ్స్‌పై పీహెచ్‌డీ రేంజ్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎవరో ఒకరు.. “ఏయ్.. రాత్రి 2:13 నిమిషాలకు హైదరాబాద్ స్లాట్ ఓపెన్ అయిందిరా!” అని మెసేజ్ పెట్టడమే ఆలస్యం... నిద్రమత్తులో ఉన్న వందల మంది స్టూడెంట్స్ ‘జాకీ చాన్’ లాగా లేచి ల్యాప్‌టాప్‌లపై పడుతున్నారు. ఇంకొందరైతే క్రోమ్ , ఫైర్‌ఫాక్స్ , ఎడ్జ్ ఇలా దొరికిన బ్రౌజర్లన్నీ ఓపెన్ చేసి ఒకదానిలో ఢిల్లీ, ఇంకొకదానిలో ముంబై, మరొకదానిలో హైదరాబాద్ లాగిన్ అయి మల్టీ టాస్కింగ్ యుద్ధం చేస్తున్నారు.

అతి సర్వత్ర వర్జయేత్... అకౌంట్ లాక్ ట్రాజెడీలు!

అయితే ఇలాంటి ‘అతి’ తెలివితేటలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదే పదే లాగిన్ అవడం, ఢిల్లీ, ముంబై, చెన్నై కాన్సులేట్‌ల మధ్య పేజీలను మారుస్తూ ఉండడం వల్ల వెబ్‌సైట్ బాట్‌లు అలర్ట్ అయి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తున్నాయి. దీంతో “పాపం.. వీసా స్లాట్ కోసం ట్రై చేసి ఉన్న అకౌంట్ లాక్ చేసుకున్నాడు” అనే సరికొత్త సానుభూతి కథనాలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూ కంటే ముందే ఈ ‘లాగ్-ఇన్’ ఇంటర్వ్యూలోనే సగం మంది ఫెయిల్ అవుతున్నారు.

ఐపీఎల్ స్కోర్ల కంటే వేగంగా స్లాట్ అలర్ట్స్!

సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానెళ్లలో అయితే పరిస్థితి మరింత హాస్యాస్పదంగా మారింది. “ఎఫ్-1 స్లాట్ అవైలేబుల్” అనే మూడు ముక్కల మెసేజ్ వస్తే చాలు... స్టాక్ మార్కెట్‌లో అప్పర్ సర్క్యూట్ వచ్చినట్లు క్షణాల్లో వైరల్ అయిపోతోంది. కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే “స్లాట్ అలర్ట్స్” నోటిఫికేషన్లు, ఐపీఎల్ లైవ్ స్కోర్ అప్‌డేట్ల కంటే వేగంగా దూసుకొస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా తిండి, నిద్ర మానేసి ఫోన్ వైబ్రేషన్ వైపే దీనంగా చూస్తున్నారు.

ఇప్పుడు అమెరికా చదవడానికి వెళ్లే విద్యార్థుల ఇళ్లలో ప్రధాన చర్చ “ఏ యూనివర్సిటీలో సీటు వచ్చింది?” అని కాదు... “అసలు వీసా స్లాట్ దొరికిందా లేదా?” అనేదే! చేతిలో ఐ-20 ఫామ్, అడ్మిషన్ లెటర్స్ ఎన్ని ఉన్నా... వీసా అపాయింట్‌మెంట్ డేట్ లేకపోతే ఆ పేపర్లన్నీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకోవడానికి మాత్రమే పనికొస్తాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు... ఈ వీసా వెబ్‌సైట్ మాయాజాలాన్ని దాటుకుని స్లాట్ బుక్ చేసుకోవడమే ప్రస్తుత కాలంలో అసలైన “డ్రీమ్ అచీవ్‌మెంట్”. ఇందులో గెలిచిన వాడికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదు..