Begin typing your search above and press return to search.

టాప్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌.. అమెరికా వీసా నిరాకరణ.. భారతీయ విద్యార్థి కలలు భగ్నం

కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ కోసం అమెరికాలోని టాప్‌-15 యూనివర్సిటీలలో ఒకదానిలో అడ్మిషన్‌ పొందిన ఈ విద్యార్థి తాజాగా విద్యార్థి వీసా (F-1 వీసా) కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

By:  A.N.Kumar   |   11 Nov 2025 5:00 PM IST
టాప్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌.. అమెరికా వీసా నిరాకరణ.. భారతీయ విద్యార్థి కలలు భగ్నం
X

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే కల కోట్లాది మంది భారతీయ విద్యార్థులదీ... ఇందుకోసం వారు సంవత్సరాల తరబడి కష్టపడతారు.. లక్షలు ఖర్చు చేస్తారు. అయితే ఎన్నో కష్టాలకోర్చి టాప్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ సాధించినా చివరకు వీసా నిరాకరణతో ఆ కల చెదిరిపోతే కలిగే బాధ వర్ణనాతీతం. అలాంటి చేదు అనుభవాన్నే ఓ ప్రతిభావంతుడైన భారతీయ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఎదుర్కొన్నాడు.

* సెక్షన్‌ 214(b) కింద నిరాకరణ: కారణం అస్పష్టం

కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ కోసం అమెరికాలోని టాప్‌-15 యూనివర్సిటీలలో ఒకదానిలో అడ్మిషన్‌ పొందిన ఈ విద్యార్థి తాజాగా విద్యార్థి వీసా (F-1 వీసా) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూకి ముందు ఎంతో ఆశగా మూడు గంటల పాటు క్యూలో నిలబడ్డాడు. అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్‌ 214(b) కింద అతనికి వీసా నిరాకరించారు.

ఈ సెక్షన్‌ ప్రకారం.. వీసా దరఖాస్తుదారుడు చదువు పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వస్తాడనే నిరూపితమైన నిబద్ధత లేకపోతే తిరస్కరించవచ్చు. అద్భుతమైన విద్యా నేపథ్యం, రెండేళ్ల ప్రొఫెషనల్‌ అనుభవం ఉన్నప్పటికీ కేవలం ఒక వీసా ఆఫీసర్‌ 'అనుమానం' కారణంగా తన కల తుడిచిపెట్టుకుపోయిందని ఆ విద్యార్థి రెడిట్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.

* "సబ్జెక్టివ్‌ అండ్‌ ఆర్బిట్రరీ" వీసా వ్యవస్థపై విమర్శ

ఆ విద్యార్థి వీసా వ్యవస్థను "సబ్జెక్టివ్‌ అండ్‌ ఆర్బిట్రరీ" (వ్యక్తిగత అభిప్రాయం, ఏకపక్ష)గా తీవ్రంగా విమర్శించాడు. కేవలం కొద్ది నిమిషాల ఇంటర్వ్యూలో అధికారి యొక్క భావోద్వేగాలు లేదా 'బోనిటా ఫీలింగ్‌' లేకపోవడం అనే కారణంతో ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి అవకాశాన్ని కోల్పోవడం అన్యాయమని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. "మూడు గంటలు లైన్లో నిలబడి, చివరికి ఒక ఆఫీసర్‌ భావనతో నా కల తుడిచిపెట్టుకుపోవడం బాధాకరం" అని అతను రాస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు.

*వీసా విధానంలో మార్పులు అవసరం

ఈ చేదు అనుభవం నేపథ్యంలో వీసా విధానంలో పారదర్శకత, హేతుబద్ధత అవసరమని ఆ విద్యార్థి కొన్ని కీలక సూచనలు చేశాడు. వీసా తిరస్కరణకు గల నిర్దిష్ట కారణాలను స్పష్టంగా వెల్లడించాలి. తిరస్కరణపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించాలి. చిన్న ఇంటర్వ్యూల బదులు, విద్యార్థి యొక్క లక్ష్యాలను వివరించే రాతపూర్వక స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

* స్వదేశంలోనే కెరీర్‌ కొనసాగింపు.. గౌరవమే ముఖ్యం

ఈ నిరాశ తర్వాత ఆ విద్యార్థి అమెరికాకు వెళ్లాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకున్నాడు. అమెరికాలో పెరుగుతున్న విద్వేష వాతావరణం, ఉద్యోగ అవకాశాల కొరత, వీసా నియమాల కఠినత కారణంగా తిరిగి ప్రయత్నించడం నిష్ప్రయోజనమని నిర్ణయించుకున్నాడు. “నా మనశ్శాంతి, గౌరవం నాకు ఆ డిగ్రీ కన్నా ఎక్కువ. నేను ఇక్కడే ఉండి నా కెరీర్‌ను కొనసాగిస్తాను” అని అతను గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకు తాను పెట్టిన సమయం, శ్రమ, డబ్బు అంతా ఒక కలగానే మిగిలిపోయినా, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యమని భావించాడు.

ఈ అనుభవం అమెరికాలో చదవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులందరికీ ఒక కఠినమైన వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ సాధించినంత మాత్రాన కల నెరవేరినట్టు కాదు.. చివరి అడ్డంకి వీసా ఇంటర్వ్యూ అనే విషయం ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.