అమెరికాలో తెలుగు విద్యార్థినికి ఘోర ప్రమాదం.. చావుబతుకుల మధ్య పోరాడుతున్న స్పందన
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి అండగా నిలవాలని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని ఘోర ప్రమాదానికి గురైంది.
By: A.N.Kumar | 5 Jun 2026 10:55 AM ISTఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి అండగా నిలవాలని ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని ఘోర ప్రమాదానికి గురైంది. మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ చేదు వార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు, స్వగ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి ఆందోళనకు గురవుతున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది?
తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన శ్రీనివాస్, సునీత దంపతుల పెద్ద కుమార్తె స్పందన లగిశెట్టి (22). చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో సమీపంలో గల ఎల్మ్‌హర్స్ట్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) రెండో సంవత్సరం చదువుతోంది.
ఎప్పటిలాగే యూనివర్సిటీలో క్లాసులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మెట్రో రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని మెట్ల మార్గంలో నడుస్తుండగా స్పందన ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి సుమారు 25 అడుగుల ఎత్తు నుండి కిందపడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో పాటు ఛాతీ, వెన్నెముక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఐసీయూలో చికిత్స.. విషమంగానే పరిస్థితి
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, రైల్వే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇల్లినాయిస్‌లోని ‘అడ్వకేట్ లూథరన్ జనరల్ హాస్పిటల్’ ఐసీయూ విభాగంలో స్పందనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ప్రస్తుతానికి ఆమె పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని సమాచారం.
రోదిస్తున్న కుటుంబం.. వీసా, పాస్‌పోర్ట్ లేక ఇబ్బందులు
కూతురు అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో ఉందన్న వార్త తెలిసి స్పందన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కన్నకూతురిని గుండెలకు హత్తుకోవాలని ఉన్నా.. వారి వద్ద పాస్‌పోర్ట్, వీసా లేకపోవడంతో వెంటనే అమెరికా వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
స్పందన తండ్రి శ్రీనివాస్ మంచిర్యాలలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తున్నారు. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన చేయి, కాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ.. కుటుంబ భారాన్ని మోస్తూ కూతురిని విదేశాలకు పంపించారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోంది.
ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థన
కూతురిని చూసేందుకు విదేశాలకు వెళ్లేలా సాయం చేయాలని స్పందన కుటుంబ సభ్యులు గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వేడుకున్నారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. స్పందన తల్లిదండ్రులకు అత్యవసర ప్రాతిపదికన పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియలు పూర్తయ్యేలా చూస్తామని.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి పైచదువుల కోసం వెళ్లిన స్పందన.. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడాలని, త్వరగా కోలుకుని తిరిగి ఇంటికి రావాలని బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. స్పందన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
