విమానంలో భారతీయ విద్యార్థి అరాచకం.. 10ఏళ్లు జైలుశిక్ష ఖాయం
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థి, ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ బోస్టన్ కోర్టులో నిలిచారు.
By: A.N.Kumar | 24 Nov 2025 11:51 AM ISTఅమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థి, ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ బోస్టన్ కోర్టులో నిలిచారు. లుఫ్తాన్సా విమానంలో ఇద్దరు మైనర్ ప్రయాణికులపై హింసాత్మక దాడికి పాల్పడిన కేసులో అతడు శిక్షార్హుడిగా నిలిచే అవకాశం ఉందని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలు రుజువైతే, అతనికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, దాదాపు ₹2 కోట్ల ($250,000) వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
* విమానంలో భీతావహ వాతావరణం
ఈ దారుణం అక్టోబర్ 25న చికాగో నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఫ్లైట్‌లో జరిగింది. భోజనం పూర్తయిన తర్వాత, మధ్య సీటులో నిద్రిస్తున్న 17 ఏళ్ల యువకుడిని ప్రణీత్ లోహపు ఫోర్క్‌తో ఎడమ భుజం వద్ద పొడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత, పక్కనే ఉన్న మరో 17 ఏళ్ల యువకుడిపై దాడి చేసి, అతని తల వెనుక భాగాన్ని ఫోర్క్‌తో గాయపరిచాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. దాడిని చూసిన విమాన సిబ్బంది జోక్యం చేసుకుని ఆపడానికి ప్రయత్నించగా, ప్రణీత్ తీవ్రమైన మానసిక ఆందోళనను ప్రదర్శించాడని సాక్షులు పేర్కొన్నారు. అతడు చేతిని తుపాకీ ఆకారంలో పెట్టి నోట్లో పెట్టుకుని 'ట్రిగ్గర్' లాగినట్లు నటించడం, ఓ మహిళా ప్రయాణికురాలిని చెంపదెబ్బ కొట్టడం, మరో సిబ్బందిపై కూడా దాడికి ప్రయత్నించడం వంటివి చేసినట్లు విమాన సిబ్బంది తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
* అత్యవసర ల్యాండింగ్, అదుపులోకి
విమానంలో ప్రణీత్ ప్రవర్తన అదుపు తప్పడంతో, విమానాన్ని బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రణీత్‌ను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.
* వీసా సమస్యలు కూడా
బోస్టన్ కోర్ట్‌లో దాఖలైన పత్రాల ద్వారా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ మొదట స్టూడెంట్ వీసాతో అమెరికాకు వచ్చినప్పటికీ, దాడి జరిగిన సమయానికి అతనికి చట్టబద్ధ విద్యార్థి హోదా లేదని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. అతడు బైబిల్ స్టడీస్‌లో మాస్టర్స్ చదువుతున్నట్లు సమాచారం.
*ఎదురుచూస్తున్న శిక్ష
కోర్టులో ప్రణీత్‌పై మోపబడిన "విమానంలో హింసాత్మక దాడి" ఆరోపణలు నిరూపణ అయితే, అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష, మూడేళ్ల పాటు పర్యవేక్షణలో విడుదల , $250,000 (దాదాపు ₹2 కోట్ల) వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు స్పష్టం చేసినట్లుగా.. ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే. కోర్టులో దోషి అని నిరూపించేవరకు ప్రణీత్‌ను నిర్దోషిగా పరిగణించాలి.
