Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు యువకుడి మరణం.. విషాదాంతంగా నవీన్ జీవితం..

అతడు బోస్టన్‌లో మాస్టర్స్ చదువుతూ.. తన కలలు కంటున్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు.

By:  Tupaki Political Desk   |   21 Nov 2025 10:46 AM IST
అమెరికాలో తెలుగు యువకుడి మరణం.. విషాదాంతంగా నవీన్ జీవితం..
X

భవిష్యత్తుపై కోటి ఆశలు, విదేశాల్లో మంచి కెరీర్‌ ఇవన్నీ క్షణాల్లో మాయం కావడానికి ఒక్క క్షణం సరిపోతుంది కావచ్చు.. ఏ కుటుంబానికైనా ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. విజయవాడ నుంచి అమెరికా వెళ్లి తన స్వప్నాలను నెరవేర్చుకోవాలనుకున్న 29 ఏళ్ల యువకుడి విషయంలో అదే జరిగింది. ఒక చిన్న నొప్పి ప్రాణాంతకంగా మారి యువకుడి శ్వాస ఆగిపోయింది. విదేశాల్లో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కుటుంబాల్లో ఈ సంఘటన ఒకే ప్రశ్నను లేవనెత్తింది. ‘మన పిల్లలు అక్కడ సురక్షితంగానే ఉన్నారా?’

విజయవాడ యువకుడు నవీన్‌కు అమెరికాలో విషాదాంతం

విజయవాడకు చెందిన 29 ఏళ్ల నవీన్‌ అమెరికాలోని బోస్టన్‌లో నవంబర్‌ 17న ఆకస్మికంగా మరణించాడు. ఈ వార్త కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్రమైన విషాదంలోకి నెట్టింది. నవీన్‌కు అప్పుడప్పుడు కడుపు నొప్పి ఉండేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ రోజు నొప్పి ఎక్కువగా రావడంతో డాక్టర్లను సంప్రదించాడు. పరీక్షల్లో ఇది తీవ్రమైన ప్యాన్‌క్రియాటిక్ ఇన్ఫెక్షన్‌ (అగ్న్యాశయానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌) అని నిర్ధారించారు. వెంటనే ఐసీయూకు తరలించినా, అక్కడ అవయవాలు ఒక్కొటీ పనిచేయకపోవడంతో ప్రాణాలు నిలువలేదు.

అతడు బోస్టన్‌లో మాస్టర్స్ చదువుతూ.. తన కలలు కంటున్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. చదువు, కెరీర్ కోసం ఇంటి నుంచి దూరంగా వెళ్లి పోరాడుతున్న ఒక యువకుడి అంతం ఇలా జరిగిపోవడం కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది. ఇటీవలి నెలల్లో అమెరికాలో ఉండే ఎంతో మంది భారతీయులు ఆకస్మికంగా గుండెనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న ఘటనలు వరుసగా నమోదు అవుతున్నాయి. ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, వాతావరణం ఇలా ఎన్నో కారణాలు దీనికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి

విదేశాల్లో చదువుకునే, ఉద్యోగాలు చేస్తున్న యువత తమ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అకస్మిక మరణాలను నివారించడానికి రెగ్యులర్‌ చెకప్‌లు, సరైన ఆహారం, ఒత్తిడి నియంత్రణ, నిద్ర ఇవి తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

యవ్వనంలోనే ఆకస్మిక మరణాలు..

నవీన్ మరణం ఒక్క కుటుంబాన్నే కాదు.. విదేశాల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. కొద్ది నెలలుగా అమెరికాలో భారతీయ యువకుల్లో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, అజ్ఞాత అనారోగ్యాలు, ఒత్తిడి, నిద్రలేమి వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుత జీవనశైలి, చదువుల్లో ఒత్తిడి, రెండు ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితులు, ఖరీదైన వైద్య సేవలు వీటన్నింటి కలయిక యువత ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

విదేశాల్లో చదువుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి

చాలా మంది విదేశాలకు వెళ్లే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు ఉండదు. అక్కడికి వెళ్లాక కూడా చదువు, ఉద్యోగం, వీసా, పార్ట్‌టైమ్ పనులతో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఇలాంటి సందర్భాల్లో చిన్న నొప్పి, తేలికైన సమస్య కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. నవీన్‌ కేసు అదే విషయాన్ని మరోసారి స్పష్టంగా చెబుతోంది.

నొప్పి చిన్నదైనా నిర్లక్ష్యం వద్దు..

బోస్టన్ వంటి నగరాల్లో వైద్య సేవలు అత్యున్నతమైనవే అయినా, ప్యాంక్రియాటిక్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కొన్ని గంటల్లోనే మల్టీ–ఆర్గన్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తాయి. ఇది అతి అరుదైనదైనా, ప్రమాదకరమైన పరిస్థితి. విదేశాల్లో ఉన్న యువత ఆరోగ్యం మరింత జాగ్రత్త అవసరం ఉంది.

భారతీయ యువత ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు

నిరంతర ఒత్తిడి, రాత్రులు మేల్కొని చదవడం, పని చేయడం, ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఆధారపడటం, శారీరక వ్యాయామం లేకపోవడం, డిప్రెషన్, ఒంటరితనం, మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితులు, ఈ జీవనశైలి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి విదేశాల్లో చదువుతున్న లేదంటే ఉద్యోగం చేస్తున్న యువత తప్పనిసరిగా రెగ్యులర్ హెల్త్ చెకప్, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, అవసరమైనప్పుడు వెంటనే హాస్పిటల్ వెళ్లడం, మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టడం లాంటివి చేయాలి.

తల్లిదండ్రులకు శాశ్వత గాయం

విదేశాలకు వెళ్లే ప్రతి యువకుడి ఇంట్లో ఒకే కల ‘మా పిల్లలు చదువుకొని మంచి స్థాయికి చేరుకోవాలి.’ కానీ ఇటీవలి కాలంలో వచ్చిన ఆకస్మిక మరణాల వార్తలు ఆ ఆనందాన్ని భయంగా మార్చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల ఆరోగ్యం గురించి కుటుంబాలు ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటున్నాయా అన్నది సందేహంగా మారింది.