Begin typing your search above and press return to search.

అమెరికాలో విషాదం.. కారులో నిద్రించి ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి..

ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర కరోలినా రాష్ట్రంలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   3 July 2026 10:39 AM IST
అమెరికాలో విషాదం.. కారులో నిద్రించి ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి..
X

అమెరికాలో భారతీయ విద్యార్థులను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంతకాలంగా అక్కడ చదువుకుంటున్న భారతీయులు వేర్వేరు కారణాలతో మరణిస్తుండటం ఇటు తల్లిదండ్రులను, అటు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర కరోలినా రాష్ట్రంలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. రతన్ కిశోర్ అనే భారతీయ విద్యార్థి కారులో నిద్రిస్తున్న సమయంలో అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు ప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అసలేం జరిగింది?

రతన్ కిశోర్ కొంతకాలంగా నార్త్ కరోలినాలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి అతను తన కారును స్టార్ట్‌లోనే ఉంచి ఏసీ ఆన్ చేసి అందులోనే నిద్రపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ కారు ఒక మూసివేసిన గ్యారేజీలో పార్క్ చేసి ఉండటమే ఇక్కడ శాపంగా మారింది. ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వెళ్లే మార్గం లేక గ్యారేజీలోనే పేరుకుపోయింది. ఆ తర్వాత అది కారు క్యాబిన్‌లోకి కూడా ప్రవేశించడంతో గాఢ నిద్రలో ఉన్న రతన్ కిశోర్ శ్వాస తీసుకోలేక అక్కడికక్కడే కన్నుమూశాడని భావిస్తున్నారు.

'సైలెంట్ కిల్లర్' కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు ప్రమాదకరం?

కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగు, రుచి, వాసన లేని ఒక అత్యంత ప్రమాదకరమైన వాయువు. అందుకే దీనిని "సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. ఇది వాతావరణంలో నిండినప్పుడు మనకు కనీసం తెలియదు కూడా... ఈ వాయువు శరీరంలోకి చేరినప్పుడు రక్తంలోని హిమోగ్లోబిన్‌తో వేగంగా కలిసిపోయి, శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. ఎక్కువసేపు ఈ వాయువును పీల్చడం వల్ల మనిషికి తెలియకుండానే స్పృహ కోల్పోతారు. నిద్రలో ఉన్నప్పుడు ఇది జరిగితే అసలు ప్రమాదాన్ని గుర్తించే అవకాశమే ఉండదు. సరైన సమయంలో చికిత్స అందకపోతే క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోతాయి. మూసివేసిన గ్యారేజీలు, అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లు లేదా గాలి ప్రసరణ లేని ఇరుకైన ప్రదేశాలలో వాహనాలను స్టార్ట్ చేసి ఉంచడం తీవ్ర ప్రాణాంతకం.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కారు నిజంగానే గ్యారేజీలో ఉందా? ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? లేదా మరేదైనా ఇతర సాంకేతిక లోపం ఉందా? అనే కోణంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రతన్ కిశోర్ భౌతికకాయానికి నిర్వహించే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.

విద్యార్థుల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు

ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, కాల్పులు, అనుమానాస్పద మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ తాజా ఘటనతో విద్యార్థుల భద్రతపై మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు స్థానిక వాతావరణం, అక్కడి నివాస గృహాల నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కారులో ఏసీ ఆన్ చేసి గంటల తరబడి నిద్రపోవడం.. క్లోజ్డ్ స్పేసెస్‌లో ఇంజిన్ ఆన్ చేయడం లాంటి పనులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని ఈ ఘటన మనకు మరోసారి హెచ్చరిస్తోంది.