లాస్ ఏంజెల్స్ లో సిక్కు వ్యక్తి వీరంగం.. కాల్చేసిన పోలీసులు
లాస్ ఏంజెల్స్‌లో 36 ఏళ్ల సిక్కు వ్యక్తి గుర్ ప్రీత్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం అమెరికాలోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.
By: A.N.Kumar | 30 Aug 2025 10:12 AM ISTలాస్ ఏంజెల్స్‌లో 36 ఏళ్ల సిక్కు వ్యక్తి గుర్ ప్రీత్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం అమెరికాలోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఈ ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదు.. పోలీసుల వ్యవహారశైలి, సాంస్కృతిక సున్నితత్వం, మానసిక ఆరోగ్య సమస్యలతో వ్యవహరించే తీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.
ఒక రద్దీ వీధిలో గుర్ ప్రీత్ సింగ్ తన కారును ఆపి.. చేతిలో కత్తితో 'గట్కా' అనే సిక్కు సంప్రదాయ యుద్ధకళను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అతని ప్రవర్తన అస్థిరంగా ఉంది. అతను తనను తాను గాయపరుచుకున్నట్లు కూడా కనిపించింది. దీంతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు అక్కడికి చేరుకుని, ఆయుధాన్ని వదిలేయమని పదేపదే హెచ్చరించినా సింగ్ వినలేదు. ఆ తర్వాత అతను పోలీసులపై సీసా విసరడం.. తన కారులో పారిపోవడానికి ప్రయత్నించడం, దారిలో ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటివి చేశాడు. చివరగా కారు ఆపి, చేతిలో కత్తితో పోలీసుల వైపు దూసుకురావడంతో వారు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత సింగ్ మరణించాడు. ఈ ఘటనలో పోలీసులు కానీ, సామాన్య పౌరులు కానీ ఎవరూ గాయపడలేదు.
-సాంస్కృతిక సున్నితత్వం
సిక్కు కమ్యూనిటీ గట్కాను వారి మతంలో సంస్కృతిలో అంతర్భాగంగా భావిస్తారు. కిర్పాన్ లేదా చిన్న కత్తిని ధరించడం వారి విశ్వాసాల్లో ఒక ముఖ్యమైన అంశం. పోలీసులు ఈ సంప్రదాయాలను అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని సిక్కు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక సాంప్రదాయ కళను ప్రదర్శిస్తున్న వ్యక్తిని తీవ్రమైన ముప్పుగా భావించి ప్రాణాంతక శక్తిని ఉపయోగించడంపై వారు ప్రశ్నిస్తున్నారు.
-పోలీసుల బలప్రయోగం
అమెరికాలో తరచుగా వినిపించే "పోలీసుల అధిక బలప్రయోగం" అనే అంశం ఈ ఘటనతో మళ్ళీ చర్చకు వచ్చింది. సింగ్ ఆయుధాన్ని వదిలేయడానికి నిరాకరించినప్పటికీ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇతర మార్గాలు ఉన్నాయేమో పరిశీలించలేదని విమర్శకులు అంటున్నారు. ప్రాణాంతక బలాన్ని ఉపయోగించే ముందు.. దాని ఆవశ్యకతను పోలీసులు సరిగ్గా అంచనా వేయలేకపోయారని కొందరు వాదిస్తున్నారు.
- మానసిక ఆరోగ్యం
సాక్షుల వాదనల ప్రకారం.. సింగ్ ప్రవర్తన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు సూచించింది. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు సైకాలజిస్టులు లేదా ప్రత్యేక సంక్షోభ నిర్వహణ బృందాల సహాయం తీసుకోవాలని, తద్వారా హింసాత్మక చర్యలను నివారించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాల్పులు జరపడం కంటే.. వ్యక్తి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.
లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై విచారణను ప్రారంభించి.. బాడీక్యామ్ ఫుటేజ్‌ను విడుదల చేసింది. పోలీసులు తమపై దాడి జరగబోతున్నప్పుడు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పేర్కొన్నారు. ఈ విచారణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ ఘటన అమెరికాలో పోలీసులకు, సిక్కు కమ్యూనిటీకి మధ్య ఉన్న సంబంధాలను, అలాగే పోలీసు సంస్కరణల ఆవశ్యకతను మరోసారి హైలైట్ చేసింది.
ఒకవైపు పోలీసుల భద్రత, మరోవైపు పౌరుల ప్రాణాలు.. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో ఉంది.
