Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయుడి దారుణం.. చాట్ జీపీటీలో చూసి తల్లి, తమ్ముడిని చంపిన బాలుడు

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతికరమైన.. తీవ్ర మనోవేదనకు గురిచేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   13 Aug 2026 10:17 AM IST
అమెరికాలో భారతీయుడి దారుణం.. చాట్ జీపీటీలో చూసి తల్లి, తమ్ముడిని చంపిన బాలుడు
X

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతికరమైన.. తీవ్ర మనోవేదనకు గురిచేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ అనే యువకుడు తన స్వంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. యాక్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానిక భారతీయ సమాజాన్ని అమెరికాలోని తెలుగు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మృతులను 45 ఏళ్ల సుధా వెంకటేశన్, ఆమె 14 ఏళ్ల కుమారుడు సిద్ధార్థ్ అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం ఉపాధి నిమిత్తం బయట ఉన్న తండ్రి ఇంటికి ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. అదే సమయంలో సిద్ధార్థ్‌కు పాఠాలు చెప్పే ప్రైవేట్ ట్యూటర్ కూడా ఫోన్ కలవకపోవడంతో తీవ్ర అనుమానం వచ్చి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న యాక్టన్ పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బేస్‌మెంట్‌లో సుధా వెంకటేశన్ మృతదేహం రక్తమడుగులో పడి ఉండగా మొదటి అంతస్తులోని గదిలో 14 ఏళ్ల సిద్ధార్థ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శరీరాలపై తీవ్రమైన గాయాలు ఉండటంతో ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన .. సంచలనాత్మకమైన అంశం ఏమిటంటే నిందితుడు అర్జున్ ఆన్‌లైన్ శోధనలు. ప్రాథమిక దర్యాప్తులో అధికారులు ఒక దిగ్భ్రాంతికర విషయాన్ని గుర్తించారు. అర్జున్ గత కొంతకాలంగా ఇంటర్నెట్‌తో పాటు చాట్ జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా హత్య ఎలా చేయాలన్న దానిపై దారుణమైన సెర్చ్‌లు చేసినట్లు తేలింది. కుటుంబ సభ్యులకు హాని కలిగించడం ఎలా? హత్య చేసే వివిధ పద్ధతులు.. నేరం చేసిన తర్వాత ఆధారాలు దొరక్కుండా తప్పించుకునే మార్గాలపై అతడు ఆన్ లైన్ లోనూ.. ఏఐ టూల్స్‌ను కూడా ప్రశ్నించినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు ఉపయోగించుకోవడంపై దర్యాప్తు అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో రక్తపాతం సృష్టించిన అనంతరం అర్జున్ తన తల్లి కారును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా సమీపంలోని వేరే పట్టణంలో పార్క్ చేసి ఉన్న కారులో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అర్జున్ అరవింద్‌పై రెండు ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసులు, మోటార్ వెహికల్ దొంగతనం అభియోగాలు నమోదు చేశారు. సంతోషంగా ఉండాల్సిన ఒక కుటుంబంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది. సాంకేతికత పెరిగిపోతున్న వేళ చిన్న పిల్లల ఆలోచనా విధానం, ఉన్మాద ప్రవర్తన ఏ దారి పడుతోందో అనేదానికి ఈ ఘటన ఒక ప్రమాద హెచ్చరికగా నిలుస్తోంది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. పూర్తి వివరాలు కోర్టు విచారణలో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.