Begin typing your search above and press return to search.

ఒంటరితనం.. చదువుల ఒత్తిడితో భారతీయ విద్యార్థి బీభత్సం.. టెక్సాస్ లో అరెస్ట్

తాజాగా ఒక భారతీయ మూలాల విద్యార్థి అరెస్ట్ వార్త షాక్ కు గురిచేస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో మనోజ్ సాయిలెల్లా(22) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  A.N.Kumar   |   27 Dec 2025 3:27 PM IST
ఒంటరితనం.. చదువుల ఒత్తిడితో భారతీయ విద్యార్థి బీభత్సం.. టెక్సాస్ లో అరెస్ట్
X

అమెరికాలో ప్రవాస భారతీయులకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ట్రంప్ తలతిక్క పనులు, ఇమిగ్రేషన్ విధానాలు, వరుస తనిఖీలు.. ఇతర జాబులు చేసుకునే వీలు లేకపోవడంతో ప్రవాస భారతీయ విద్యార్థులు ఇప్పుడు భిక్కుభిక్కుమంటూ బతుకుతున్నారు. అగ్రరాజ్యంలో ఏమాత్రం సేఫ్ గా ఉండడం లేదు. ఇక ఇది చాలదన్నట్టు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల వరుస మరణాలు, దాడుల వార్తలు కలకలం రేపుతున్నాయి.

తాజాగా ఒక భారతీయ మూలాల విద్యార్థి అరెస్ట్ వార్త షాక్ కు గురిచేస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో మనోజ్ సాయిలెల్లా(22) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రవాస భారతీయ సమాజంలో కలకలం రేపింది.

అసలేం జరిగింది.?

మనోజ్ సాయి లెల్లా అనే ప్రవాస భారతీయ సంతతి విద్యార్థి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ (యూటీడీ) లో సీనియర్ విద్యార్థిగా చదువుతున్నాడు. అయితే కొద్దిరోజులుగా మనోజ్ తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ కుమారుడి ప్రవర్తన అదుపు తప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మనోజ్ మెంటల్ కండీషన్ పాడైందని.. తమను తీవ్రంగా బెదిరించడమే కాకుండా నివాస గృహానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడని కుటుంబ సభ్యులుఫిర్యాదు చేశారు.

ఫ్రిస్కో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మనోజ్ ను అరెస్ట్ చేారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నివాస ప్రాంతానికి లేదా ప్రార్థనాస్థలానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించేలా నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినందుకు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉగ్రవాద తరహా బెదిరింపులకు పాల్పడినందుకు కేసులు నమోదు చేశారు. మనోజ్ ప్రార్థనాస్థలాలపై దాడి చేయడానికి ప్రయత్నించాడే వార్తలను పోలీసులు తోసిపుచ్చారు. అలాంటి ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

ఈ కేసుల తీవ్రత దృష్ట్యా కోర్టు భారీ మొత్తంలో బెయిల్ ను నిర్ణయించింది. అగ్ని ప్రమాద యత్నం కేసుకు లక్ష డాలర్లు .. బెదిరింపుల కేసుకు 3500 డాలర్లు మొత్తంగా భారీ బాంబ్ చెల్లిస్తేనే అతడికి బెయిల్ లభించే అవకాశం ఉంది.

మానసిక ఆరోగ్యమే ప్రధానాంశం

ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించే పనిలో అధికారులు ఉన్నారు. మనోజ్ గతంలో ఎలాంటినేర చరిత్రలేని వ్యక్తి కావడంతో కేవలం మానసిక ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యల వల్లే ఇలా ప్రవర్తించి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. విదేశాల్లో ఒంటరితనం.. చదువుల ఒత్తిడి వంటివి విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

భారత్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవడం పట్ల తెలుగు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చదువుతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.