ఆ విషయంలో అమెరికాలో భారతీయులే టాప్... ట్రంప్ కు అర్ధమవుతుందా..!
అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రపై ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 10 Jan 2026 7:00 PM ISTఅమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్రపై ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్స్ అంటూనే.. భారతీయులపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూ, వీసాల విషయలోనూ, గ్రీన్ కార్డ్స్ జారీలోనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే చర్చా జరుగుతున్న సంగతీ తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. అమెరికాలో ఉన్న విదేశాల్లో జన్మించిన బిలియనీర్ల సంఖ్యలో అగ్రగామిగా ఉన్న దేశంగా ఇజ్రాయెల్ ను అధిగమించి భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.
అవును... అమెరికాలో నివసిస్తున్న విదేశీ బిలియనీర్లకు భారతదేశం నాయకత్వం వహిస్తుందని.. ఈ విషయంలో ఇజ్రాయెల్ ను అధిగమించిందని ఫోర్బ్స్ 2025 జాబితా వెల్లడించింది. ఈ ఆసక్తికర విషయం ప్రపంచ ప్రభావంలో పెరుగుతున్న భారతీయ ప్రవాసుల కీలక పాత్రను ప్రతిబింబిస్తుందని అంటున్నారు. ప్రధానంగా... సాంకేతికత, ఆర్థిక రంగాలలో భారతీయుల పాత్ర అగ్రారాజ్యంలో మరింత కీలకంగా మారుతూ రోజు రోజుకీ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో భారత్ తర్వాత స్థానంలో ఇజ్రాయెల్, తైవాన్ లు నిలవగా.. కెనడా, చైనా తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఫోర్బ్స్ 2025 తాజా నివేదిక ప్రకారం... అమెరికాలో భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ల సంఖ్య 2022లో ఐదుగురుగా ఉండగా.. 2025లో ఆ సంఖ్య 12కి పెరిగింది. ఈ పెరుగుదల అమెరికాలో విదేశీ బిలియనీర్ల సంఖ్యలో టాప్ లో ఉన్న ఇజ్రాయెల్ ను భర్తీ చేస్తూ భారతదేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ బిలియనీర్ల సంఖ్యలో ఎక్కువమందికి టెక్నాలజీ రంగం వారి సంపదకు ప్రాథమిక వనరుగా ఉంటే.. ఆ తర్వాత స్థానంలో ఆర్థిక రంగంలోని వ్యక్తులు ఉన్నారు. వీరిలో 93% మందికి వారి సంపద స్వయంగా సృష్టించబడిందని ఫోర్బ్స్ నివేదిక జోడించింది.
ఈ జాబితాలో భారత్ నుంచి సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘జెడ్ స్కేలర్’ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ‘సన్ మైక్రోసిస్టమ్స్’ వినోద్ ఖోస్లా.. ‘యూఎస్ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్’ రాకేష్ గంగ్వాల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే... ఈ విషయంలో భారతదేశం తన సంఖ్యను పెంచుకోవడమే కాకుండా.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో తన వ్యూహాత్మక స్థానాన్ని కూడా పెంచుకుందని అంటున్నారు పరిశీలకులు!
ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ లో టాప్ 10 ధనవంతులైన భారత సంతతికి చెందిన బిలియనీర్లు (2025) జాబితా ఈ విధంగా ఉంది...:
1) జే చౌదరి - 17.9 బిలియన్ డాలర్లు
2) వినోద్ ఖోస్లా - 9.2 బిలియన్ డాలర్లు
3) రాకేష్ గంగ్వాల్ - 6.6 బిలియన్ డాలర్లు
4) రొమేష్ టి. వాధ్వానీ - 5.0 బిలియన్ డాలర్లు
5) రాజీవ్ జైన్ - 4.8 బిలియన్ డాలర్లు
6) కవిటార్క్ రామ్ - 3.0 బిలియన్ డాలర్లు
7) రాజ్ సర్దానా - 2.0 బిలియన్ డాలర్లు
8) డేవిడ్ పాల్ - 1.5 బిలియన్ డాలర్లు
9) నికేష్ అరోరా - 1.4 బిలియన్ డాలర్లు
10) సుందర్ పిచాయ్ - 1.1 బిలియన్ డాలర్లు
