భారత సంతతి వ్యక్తి హత్య... కెనడాలో పరిస్థితులు ఇలా మారిపోతున్నాయేమిటి?
విదేశాల్లో ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై జరుగుతున్న దాడులు ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
By: Raja Ch | 31 Oct 2025 2:00 PM ISTవిదేశాల్లో ఉన్న భారతీయులు, భారత సంతతి వ్యక్తులపై జరుగుతున్న దాడులు ఇటీవల కాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు కారణమే లేకపోయినా, కారణం ఉండి తప్పు అవతలి వ్యక్తిదే అయినా.. జాత్యహంకారమో.. లేక, డ్రగ్స్ మైకమో తెలియదు కానీ.. భారతీయులపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో భారత సంతతి వ్యక్తి బలయ్యారు.
అవును... విదేశాల్లో దాడులకు, హత్యలకు గురవుతున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులకు సంబంధించిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన కారుపై మూత్రం పోస్తున్న వ్యక్తిని వారించినందుకు.. దాడికి గురికాబడిన భారత సంతతి వ్యక్తి కథ విషాదంగా ముగిసింది. గత శుక్రవారం అతడు ప్రాణాలు విడిచారని అధికారులు వెల్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే... కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అర్వి సింగ్ సాగూ(55)దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అతడు దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన సింగ్.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.
అర్వి సింగ్ సాగూ, రాత్రి భోజనం తర్వాత తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్ లోపల నుంచి, పార్కింగ్ స్థలంలో ఉన్న తన కారు వద్దకు తిరిగి వస్తుండగా.. ఓ అపరిచితుడు కారుపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ సమయంలో ఆ వ్యక్తి వద్దకు వెళ్లిన సింగ్.. "ఏయ్, నువ్వు ఏం చేస్తున్నావు?" అని అడిగాడు, దానికి ఆ వ్యక్తి "నాకు ఏమి కావాలో" అదే అన్నాడు.
అక్కడితో ఆగని ఆ వ్యక్తి.. సింగ్ దగ్గరకు వెళ్లి అతని తలపై గట్టిగా కొట్టాడు. దీంతో సింగ్ నేలపై పడిపోయాడు. దీంతో.. అతని స్నేహితురాలు 911 కు కాల్ చేసింది. అయితే.. పారామెడిక్స్ వచ్చేసరికి, సింగ్ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి లైఫ్ సపోర్ట్ పై ఉంచినప్పటికీ, ఐదు రోజుల తర్వాత అతను మరణించాడు.
ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ (ఈపీఎస్) ప్రకారం.. 109 స్ట్రీట్, 100 అవెన్యూ సమీపంలో జరిగిన దాడి గురించి అధికారులకు సమాచారం అందింది. దీంతో.. 55 ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో, ప్రాణాంతక గాయాలతో బాధపడుతున్నట్లు వారు కనుగొన్నారు. వెంటనే.. అర్వి సింగ్ సాగూను ఆసుపత్రికి తరలించారు, ఐదు రోజుల తర్వాత అతను మరణించాడు.
నిందితుడిని కైల్ పాపిన్ గా పోలీసులు గుర్తించారు. ఎడ్మంటన్ పోలీసులు అతనిని అరెస్టు చేసి తీవ్రమైన దాడికి పాల్పడ్డాడని అభియోగం మోపారు. మరోవైపు సాగూ సన్నిహిత మిత్రుడు విన్సెంట్.. అతని పిల్లలను పోషించడానికి, అంత్యక్రియల ఖర్చులు, జీవన వ్యయాలను భరించటానికి నిధుల సేకరణను ప్రారంభించాడు.
