Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి రూ. 258 కోట్ల ట్యాక్స్ స్కామ్ వెనుక 'కార్పొరేట్ మైండ్' కథ

ఆనంద్ శుక్లా గ్యాంగ్ ఇది ఏదో రహస్యంగా చేసిన నేరం కాదు. సెమినార్లు, వెబ్‌నార్లు, పాడ్‌కాస్ట్‌లు, నేరుగా డెమోలు ఇస్తూ పక్కా కార్పొరేట్ పద్ధతిలో వ్యాపారులకు గాలం వేశారు.

By:  A.N.Kumar   |   13 Sept 2026 12:58 PM IST
అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తి రూ. 258 కోట్ల ట్యాక్స్ స్కామ్ వెనుక కార్పొరేట్ మైండ్ కథ
X

"సొంతంగా ఆస్తులేవీ ఉంచుకోకండి.. కానీ అన్నింటిపై నియంత్రణ మీరే తీసుకోండి".. సరిగ్గా ఈ ఒక్క సూత్రంతోనే టెక్సాస్‌కు చెందిన ఆనంద్ శుక్లా అనే భారత సంతతి వ్యక్తి అమెరికా వ్యాపారవేత్తలను ఆకర్షించాడు. చట్టబద్ధమైన లొసుగులను వాడుకుని పన్నులు సున్నా చేసుకోవచ్చని ఆశచూపి చివరకు రూ. 258 కోట్ల భారీ స్కామ్‌తో కటకటాలపాలయ్యాడు.

పక్కా 'మార్కెటింగ్ ప్లాన్'తో గాలం

ఆనంద్ శుక్లా గ్యాంగ్ ఇది ఏదో రహస్యంగా చేసిన నేరం కాదు. సెమినార్లు, వెబ్‌నార్లు, పాడ్‌కాస్ట్‌లు, నేరుగా డెమోలు ఇస్తూ పక్కా కార్పొరేట్ పద్ధతిలో వ్యాపారులకు గాలం వేశారు.

98% ఆదాయం గాయబ్

వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో ఏకంగా 98 శాతాన్ని పన్నుల పరిధిలోకి రాకుండా ‘ట్రస్టులు’, ‘ఫ్యామిలీ ఫౌండేషన్ల’ పేరిట రూపొందించిన వివిధ నెట్‌వర్క్‌ల గుండా మళ్లించేలా క్లయింట్లకు ప్లాన్ డిజైన్ చేసి ఇచ్చాడు.

ఒక్కో క్లయింట్ నుంచి కోట్లలో ఫీజు

ఈ 'ట్యాక్స్ మినహాయింపు' విద్యను నేర్పించినందుకు గానూ ఒక్కో ప్యాకేజీని $25,000 నుంచి $55,000 వరకు విక్రయించాడు. కొన్ని కేసుల్లో క్లయింట్ల నుంచి ఏకంగా $2,25,000 డాలర్ల వరకు ఫీజుగా లాగాడు.

పర్సనల్ లైఫ్.. బిజినెస్ బిల్స్

వ్యక్తిగత అవసరాలైన విలాసవంతమైన కార్లు, ఇళ్ల ఈఎంఐలు, మార్ట్ గేజ్ లోన్లు , వినోద ఖర్చులను కూడా ట్రస్ట్ ఖాతాల ద్వారా చెల్లింపజేసి వాటిని వ్యాపార ఖర్చులుగా పన్ను మినహాయింపుల్లో చూపించేలా ప్రణాళిక రచించాడు.

న్యాయం గెలిచింది

తాను చెప్పిన స్కీమ్‌ను స్వయంగా తానూ ఉపయోగిస్తూ అమెరికా పన్నుల శాఖ (ఐఆర్ఎస్) కన్నుగప్పిన శుక్లా ఆటను దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా కట్టిపెట్టాయి. కేసు తీవ్రతను నిరూపించడంతో మార్చి 10న అతను నేరాంగీకారం చేసుకున్నాడు. దాంతో టెక్సాస్ కోర్టు అతనికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. స్మార్ట్ ప్లానింగ్ పేరుతో చట్టాన్ని చుట్టాలని చూస్తే ఎంత పెద్ద కార్పొరేట్ మేధావి అయినా సరే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ఈ ఘటన నిరూపించింది.

‘సక్సెస్ స్టోరీ’లు మరో వైపు

అమెరికాలో భారతీయుల విజయాలను సాధారణంగా కష్టపడి ఎదిగిన వలసదారుల కథలుగా చూస్తాం. కానీ వ్యాపార వ్యవస్థలు ఎంత క్లిష్టంగా మారుతున్నాయో వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా అంతే పెరుగుతున్నాయి. శుక్లా కేసులో కూడా ఇదే అంశం కనిపిస్తుంది. చట్టబద్ధంగా కనిపించే ట్రస్టులు, ఫౌండేషన్లు, పన్ను మినహాయింపులు వంటి వ్యవస్థలను ఒక పథకంలో భాగంగా ఉపయోగించారన్నది ప్రాసిక్యూషన్ వాదన. అంటే ఆధునిక ఆర్థిక మోసాలు ఎప్పుడూ నకిలీ పత్రాలు లేదా దొంగిలించిన డబ్బుతోనే ఉండాల్సిన అవసరం లేదు. చట్టంలోని సంక్లిష్టతను సామాన్యులకు అర్థం కాని విధంగా ఉపయోగించడం కూడా పెద్ద మోసానికి దారితీయవచ్చు.

భారతీయ సమాజానికి కూడా హెచ్చరికే

ఈ కేసును అమెరికాలోని భారత సంతతి సమాజంపై మచ్చగా చూడటం కంటే చట్టపరమైన నిబంధనలను దాటితే ఎంత పెద్ద ఆర్థిక నెట్‌వర్క్ ఉన్నా రక్షణ ఉండదనే హెచ్చరికగా చూడటం మంచిది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే వారు పన్ను తగ్గించుకునేందుకు చట్టబద్ధమైన మార్గాలను, పన్ను ఎగవేతను ప్రోత్సహించే అక్రమ పద్ధతులను స్పష్టంగా వేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆనంద్ శుక్లాకు పడిన ఐదేళ్ల శిక్ష ఒక వ్యక్తి కథ మాత్రమే కావచ్చు. కానీ దాని వెనుక ఉన్న సందేశం మాత్రం పెద్దది.. అమెరికాలో భారతీయుల విజయగాథ ఎంత బలంగా ఉందో.. ఆ విజయాన్ని దుర్వినియోగం చేస్తే చట్టం అంతే కఠినంగా స్పందిస్తుందనే వాస్తవాన్ని కూడా ఈ కేసు గుర్తుచేస్తోంది.