₹5 లక్షల జీతం.. అయినా మనశ్శాంతి లేదు.. ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్న యూకే ఎన్నారై
మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం, మెరుగైన అవకాశాలు కోసం లక్షలాది మంది భారతీయులు అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్తున్నారు
By: A.N.Kumar | 8 May 2026 10:28 PM ISTవిదేశాల్లో స్థిరపడటం ఇప్పటికీ చాలామంది యువత కల. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం, మెరుగైన అవకాశాలు కోసం లక్షలాది మంది భారతీయులు అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే బయటకు కనిపించే ఆ “డ్రీమ్ లైఫ్” వెనుక ఎన్నో భావోద్వేగ సమస్యలు దాగి ఉంటాయని తాజాగా యూకేలో నివసిస్తున్న ఓ భారతీయ యువకుడి కథ మరోసారి గుర్తుచేసింది.
26 ఏళ్ల భారతీయ ఎన్నారై తన మనసులోని బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. నెలకు పన్నులు కట్ చేసిన తర్వాత సుమారు ₹5 లక్షల జీతం వస్తున్నప్పటికీ తాను సంతోషంగా లేనని, జీవితంలో ఏదో కోల్పోయిన భావన వెంటాడుతోందని అతడు చెప్పాడు. ప్రస్తుతం యూకేలో మంచి ఉద్యోగం, స్థిరమైన జీవితం ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర ఒత్తిడి, ఒంటరితనం అనుభవిస్తున్నట్లు వెల్లడించాడు.
ఆ యువకుడు 18 ఏళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి యూకేకు వెళ్లినట్లు తెలిపాడు. అయితే ఆ నిర్ణయం తన ఇష్టంతో తీసుకున్నది కాదని.. కుటుంబ పరిస్థితుల కారణంగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో స్థిరపడి మంచి ఆదాయం సంపాదిస్తున్నా, తన బాల్యం, స్నేహితులు, భారతీయ జీవనశైలి, కుటుంబ బంధాలు అన్నీ మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు.
“బయటికి చూస్తే నా జీవితం చాలా బాగానే కనిపిస్తుంది. మంచి జీతం, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ లోపల మాత్రం ఖాళీగా అనిపిస్తోంది. ఇక్కడ జీవితం చాలా మెకానికల్‌గా మారిపోయింది” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం ఉండేదని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం ఎంతో విలువైనదని ఇప్పుడు అర్థమవుతోందని తెలిపాడు.
ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు “డబ్బుతో మాత్రమే సంతోషం రాదు”, “మనుషుల మధ్య బంధాలే నిజమైన సంపద” అంటూ అతడికి మద్దతు పలికారు. మరికొందరు మాత్రం “భారత్‌లో ఉన్నవారికి విదేశీ జీవితం కలలా కనిపిస్తుంది. అక్కడి ఒత్తిడులు అనుభవించిన తర్వాతే అసలు పరిస్థితి తెలుస్తుంది” అని కామెంట్ చేస్తున్నారు.
ఇంకొందరు యువత విదేశాలకు వెళ్లే ముందు కేవలం జీతాలు, లైఫ్ స్టైల్ మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం, కుటుంబ బంధాలు, సామాజిక జీవితం వంటి అంశాలను కూడా ఆలోచించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయ యువత తమ అనుభవాలను కూడా కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.
