Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయ మోటల్ యజమాని అరెస్ట్: మహిళ బంధీ ఘటనలో విస్తుపోయే నిజాలు!

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   21 Feb 2026 6:00 PM IST
అమెరికాలో భారతీయ మోటల్ యజమాని అరెస్ట్: మహిళ బంధీ ఘటనలో విస్తుపోయే నిజాలు!
X

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక మహిళను మోటల్‌లో (వాహనదారుల కోసం హైవేల పక్కన ఏర్పాటు చేసిన ఒక రకమైన వసతి గృహం) బంధించిన ఉదంతంలో భారత సంతతికి చెందిన మోటల్ యజమాని దీపక్ కుమార్ పటేల్ (64) పోలీసులకు చిక్కారు. విచారణకు సహకరించకుండా ఆధారాలను తారుమారు చేశారనే తీవ్ర ఆరోపణలతో ఆయనను అధికారులు జైలుకు తరలించారు.

అసలేం జరిగింది?

స్ప్రింగ్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లోని ఒక మోటల్‌లో ఓ మహిళ ప్రాణాపాయంలో ఉందని, ఆమెను ఎవరో బలవంతంగా నిర్బంధించారనే సమాచారం ఫిబ్రవరి 3న పోలీసులకు అందింది. బాధితురాలు అక్కడ నుండి తప్పించుకోలేక నరకయాతన అనుభవిస్తోందని తెలియడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.

పోలీసుల తనిఖీ.. విస్తుపోయే విషయాలు

పోలీసులు మోటల్‌పై దాడి చేసిన సమయంలో బాధితురాలు అక్కడ బందీగా ఉన్నట్లు గుర్తించి ఆమెను రక్షించారు. అదే సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో మోటల్ యజమాని దీపక్ పటేల్ పాత్ర పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. బాధితురాలి గురించి అడిగినప్పుడు పటేల్ తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పోలీసులకు దొరకకుండా మోటల్ రిజిస్టర్లు, రికార్డులను ఆయన మార్చేశారని అధికారులు నిర్ధారించారు. యజమాని సహాయ నిరాకరణ వల్ల బాధితురాలిని కాపాడటంలో కొంత ఆలస్యం జరిగిందని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీపక్ కుమార్ పటేల్‌పై అమెరికన్ చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం... కీలకమైన రికార్డులను మార్చడం లేదా ధ్వంసం చేయడంపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయనను సమ్మిట్ కౌంటీ జైలుకు తరలించారు. బాడీక్యామ్ వీడియోలో పటేల్ "నాకు ఏమీ తెలియదు, గుర్తు లేదు" అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినా సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఆయనను నిలదీశారు.

ఈ ఘటనతో అమెరికాలోని మోటల్ వ్యాపారాల్లో భద్రతా ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. గతంలో కూడా ఈ మోటల్‌లో పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మోటల్ యజమానుల బాధ్యతపై కఠిన చట్టాలు తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.