యూకే కాఫీ షాప్ బయట మనోడి బైక్ పోయింది.. తర్వాతేమైందో తెలుసా?
హోటల్ బయటో.. కాఫీ ఎదుట బైక్ పెట్టి లోపలకు వెళ్లి వచ్చసరికి బైక్ మాయం కావటం చాలామందికి అనుభవమే.
By: Garuda Media | 19 Sept 2025 10:52 AM ISTహోటల్ బయటో.. కాఫీ ఎదుట బైక్ పెట్టి లోపలకు వెళ్లి వచ్చసరికి బైక్ మాయం కావటం చాలామందికి అనుభవమే. మనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాకున్నా.. మనకు తెలిసినోళ్లలో చాలామందికి ఇలాంటివి జరుగుతుండే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఇలాంటి పరిస్థితే బ్రిటన్ లో ఎదురవుతుందంటే నమ్ముతామా? కానీ.. ఒక భారతీయుడి ఇలాంటి దారుణ పరిస్థితి ఎదురైంది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలుసుకోవటమే కాదు.. బ్రిటన్ పెద్ద మనిషి ఒకరు రియాక్టు అయిన తీరును చూసినప్పుడు ఒకరు తమ దేశాన్ని ఎంతలా ప్రేమించాలన్న దానికి ఒక నిదర్శనంగా ఆయన కనిపిస్తారు. అసలేం జరిగిందంటే..
దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల యోగేష్ అలెకరి తన కేటీఎం బైక్ మీద దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తున్నాడు. అందులో భాగంగా మేలో ఆయన తన తాజా యాత్ర మళ్లీ షురూ చేశారు. అందులో భాగంగా పలు దేశాలు తిరుగుతూ యూకేకు వెళ్లి అక్కడి నుంచి ఆఫ్రికాకు వెళ్లటంతో తాజా టూర్ ను ముగిద్దామని భావించాడు. షెడ్యూల్ లో భాగంగా సెప్టెంబరు మొదటి వారానికి యూకేకు చేరుకున్నాడు.
బ్రిటన్ లోని నాటింగ్ హోమ్ లో ఒక కేఫ్ వద్ద ఆగి కాఫీ తాగి బయటకు వచ్చేసరికి అతడి బైక్ తో పాటు.. వస్తువులు మాయమయ్యాయి. దీంతో అతడి యాత్ర అర్థాంతరంగా ఆగినట్లైంది. దేశం కాని దేశంలో బైక్ కొనటం ఖరీదైన వ్యవహారం. దీంతో.. ఏం చేయాలో పాలుపోని అతను.. ఇన్ స్టాలో తన ఆవేదనను షేర్ చేసుకున్నాడు. దీనికి స్పందనగా ఇన్ స్టాలో అతన్ని ఫాలో అవుతున్న పలువురు బైక్ కొనిచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే.. వీరందరిలోనూ నాటింగ్ హోమ్ కు చెందిన ఒక సెకండ్ హ్యాండ్ బైక్ స్టోర్ పెద్ద మనిషి స్పందించారు.
‘మా దేశం మర్యాదను మేం పోగొట్టుకోం. అతనికి అలాంటి బైకే మరిత మంచి కండిషన్ లో ఉన్నది ఇస్తాం’ అని ప్రకటించటమేకాదు.. బైక్ అందించాడు. దీంతో.. యోగేష్ యాత్ర మళ్లీ మొదలైంది. ఈ ఉదంతాన్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే దేశం పరువును కాపాడటం అందరి బాధ్యత. అందుకు ఎవరి వంతు చేయాల్సింది వారు చేయాల్సిందే. అంతేకాదు.. ఈ ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. మన దేశానికి వచ్చే విదేశీ టూరిస్టుల విషయంలో మరింత సాయంగా ఉండదాల్సిన అవసరం ఉంది. అదే మనందరి ధర్మం.
