అమెరికా నుంచి భారత్‌కు ఐటీ ఉద్యోగుల రివర్స్ జర్నీ.. 9 నెలల్లో 12,700 మంది వెనక్కి!
ఒకప్పుడు అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించడం భారతీయ యువతకు ఒక డ్రీమ్ గోల్.
By: A.N.Kumar | 22 Oct 2026 9:53 AM ISTఒకప్పుడు అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించడం భారతీయ యువతకు ఒక డ్రీమ్ గోల్. భారీ వేతనాలు.. మెరుగైన జీవన ప్రమాణాలు.. అంతర్జాతీయ స్థాయి కెరీర్ అవకాశాల కోసం వేలాది మంది టెక్ నిపుణులు అమెరికా బాట పట్టేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. వీసా అనిశ్చితులు, ప్రధాన టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. కఠినతరం అవుతున్న ఇమ్మిగ్రేషన్ విధానాల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా అనేకమంది భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
స్టాఫింగ్ దిగ్గజం ఎక్స్-ఫీనో వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం తొమ్మిది నెలల్లోనే సుమారు 12,700 మంది టెక్నాలజీ నిపుణులు అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. గత నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోంది.. 2023లో 7,200 మంది, 2024లో 9,800 మంది, 2025లో 15,100 మంది, 2026 తొలి 9 నెలల్లో 12,700 మంది వెనక్కి తిరిగి వచ్చారు. అయితే ఈ తిరోగమనం మధ్య కూడా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే నిపుణుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఈ ఏడాదే సెప్టెంబర్ నాటికి సుమారు 14,500 మంది భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం విశేషం.
భారీ వేతన వ్యత్యాసం.. అతిపెద్ద సవాలు
స్వదేశానికి తిరిగి వస్తున్న ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వేతన వ్యత్యాసం. అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే ఒక ఫుల్‌స్టాక్ ఇంజినీర్ సగటున ఏడాదికి 105,000 డాలర్లు (సుమారు 70,000 - 150,000) డాలర్ల వరకు వేతనం పొందుతారు. కానీ భారత్‌లో అదే నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులకు ఏడాదికి 20,000 డాలర్ల నుంచి 32,000 డాలర్ల మధ్య మాత్రమే లభిస్తోంది.
అయితే రెండు దేశాల్లో ఉన్న పన్నులు, జీవన వ్యయం, ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ ఆర్థిక పరిస్థితుల్లో కొంత వ్యత్యాసం తగ్గినప్పటికీ ఆదాయంలో కోత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
అనుభవం కంటే నైపుణ్యాలకే పీఠం
గతంలో విదేశీ అనుభవం ఉంటే భారత్‌లో ఉద్యోగం సులువుగా లభించేది. కానీ మారుతున్న టెక్నాలజీ యుగంలో పరిస్థితులు మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతల్లో ప్రతిభ ఉన్నవారికే కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. "అమెరికాలో పదేళ్ల అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోతే ఆశించిన ఉద్యోగం దక్కడం కష్టమే." అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ కుండబద్దలు కొట్టారు.
వీసా గ్రేస్ పీరియడ్ ఒత్తిళ్లు
హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యోగం కోల్పోతే గరిష్ఠంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లేదా వీసా బదిలీ చేసుకోవడం కుదరకపోతే కుటుంబ సభ్యుల భవిష్యత్తు , పిల్లల చదువులు, ఆర్థిక రుణాల దృష్ట్యా స్వదేశానికి రాక తప్పనిసరి అవుతోంది.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు భారత్‌లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక అనుభవజ్ఞుల పోటీని తట్టుకోవడం సవాలుగా మారింది. అమెరికా ఉద్యోగాల క్రేజ్ పూర్తిగా తగ్గకపోయినా..మారిన పరిస్థితుల వల్ల ఉద్యోగులకు "స్కిల్ అప్‌గ్రేడేషన్" తప్పనిసరిగా మారింది. ఏ దేశంలో పనిచేస్తున్నా.. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను పుణికిపుచ్చుకోవడమే నిలకడైన కెరీర్‌కు ఏకైక మార్గం.
