Begin typing your search above and press return to search.

అమెరికా 'గ్రీన్ కార్డ్' కల పై మరో 'భారీ' పిడుగు..

ఏళ్ల తరబడి నిరీక్షించిన రాత్రులకు రేపటి రోజునైనా వెలుగు వస్తుందేమోనని కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్న ఎన్నారై అభాగ్యులకు, ఇమ్మిగ్రేషన్ విభాగం తీసుకున్న దారుణ నిర్ణయాలు గుండెల్లో కోలుకోలేని గాయాన్ని మిగిల్చాయి.

By:  A.N.Kumar   |   1 Oct 2026 3:00 PM IST
అమెరికా గ్రీన్ కార్డ్ కల పై మరో భారీ పిడుగు..
X

ఏళ్ల తరబడి నిరీక్షించిన రాత్రులకు రేపటి రోజునైనా వెలుగు వస్తుందేమోనని కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్న ఎన్నారై అభాగ్యులకు, ఇమ్మిగ్రేషన్ విభాగం తీసుకున్న దారుణ నిర్ణయాలు గుండెల్లో కోలుకోలేని గాయాన్ని మిగిల్చాయి. ఒకవైపు నింగినంటే ఫీజుల మోతతో ఆస్తులు కరిగిపోతుంటే.. మరోవైపు కదలకుండా పాతాళంలో నిలిచిపోయిన వీసా తేదీలు విదేశీ గడ్డపై భారతీయులను అభద్రతాభావం అనే బానిస సంకెళ్లలోకి తోసివేస్తున్నాయి...

అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా అడుగుపెట్టాలని.. కష్టపడి సంపాదించుకున్న నైపుణ్యంతో అక్కడ శాశ్వత నివాసం గ్రీన్ కార్డ్ ఏర్పాటు చేసుకోవాలని కలలుకనే వేలాది మంది భారతీయులకు అక్టోబర్ 2026 తీవ్ర నిరాశను.. ఆందోళనను మోసుకొచ్చింది. దశాబ్దాలుగా రేపటి వెలుగుల కోసం నిరీక్షిస్తున్న అభాగ్యులకు ఇమ్మిగ్రేషన్ విభాగం సవరించిన నిర్ణయాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ఒకవైపు ఆర్థికంగా కుంగదీసే భారీ ఫీజుల పెంపు.. మరోవైపు ఏళ్ల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న ప్రాధాన్యత తేదీల నిలిచివేత భారతీయ కుటుంబాల గుండెల్లో తీవ్ర గుబులు రేపుతున్నాయి.

ధనవంతులు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల ద్వారా గ్రీన్ కార్డ్ పొందేలా ప్రోత్సహించే ఈబీ-5 ప్రోగ్రామ్‌కు ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్.సీఐఎస్) భారీగా ఫీజులు పెంచి నవంబర్ 30 నుంచి అమలు చేయనుంది. ప్రత్యక్ష పెట్టుబడిదారులకు సంబంధించిన ఫారం ఐ-526 ఫీజు ప్రస్తుతం ఉన్న 3,675 డాలర్ల నుంచి ఒక్కసారిగా 7,615 డాలర్లకు పెరగగా.. రీజినల్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసే ఫారం ఐ-526ఈ ఫీజు 7,850 డాలర్లకు చేరింది. రీజినల్ సెంటర్లకు చెందిన ఫారం ఐ-956 ఫీజు 17,795 డాలర్ల నుంచి ఏకంగా 44,115 డాలర్లకు.. ఫారం ఐ-956ఎఫ్ ఫీజు 42,675 డాలర్లకు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులను అమెరికా ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతూ ఉద్యోగాలు సృష్టిస్తున్న భారతీయ పెట్టుబడిదారులకు.. ఈ అదనపు టెక్నాలజీ ఇంటిగ్రిటీ రుసుములు మోయలేని భారాన్ని మిగిల్చాయి.

మరోవైపు అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులు ఆశలు పెట్టుకున్న ఈబీ-2 కేటగిరీ పరిస్థితి మరింత కరుణాజనకంగా మారింది. అక్టోబర్ వీసా బులెటిన్ ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలకు ఫైనల్ యాక్షన్ డేట్ జనవరి 1, 2025 కి వెనక్కి వెళ్లగా.. భారత్‌కి మాత్రం ఫైనల్ యాక్షన్ డేట్ నవంబర్ 1, 2013 వద్ద.. ఫైలింగ్ డేట్ జనవరి 15, 2015 వద్దే పాతాళంలా కదలకుండా ఉండిపోయాయి. దీనివల్ల ఇతర దేశాల్లో వచ్చిన మార్పుల ప్రభావం పడి భారతీయులకు దక్కాల్సిన అదనపు వీసాల ప్రయోజనం కూడా పూర్తిగా ఆవిరైపోయింది.

ఈ ఘోర పరిణామాలతో పదేళ్లకు పైగా వర్క్ పర్మిట్లు, ప్రయాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వేలాదిమంది భారతీయుల ఆశలు అడియాసలయ్యాయి. సొంత ఊరిలో కన్నవారికి అత్యవసర పరిస్థితి వచ్చినా స్వదేశానికి వెళ్లలేని బానిస బతుకులు బతుకుతున్నామని సోషల్ మీడియా వేదికల్లో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక్కడ ఉద్యోగ భద్రత లేక.. వీసా ముందుకు కదలంగా విసిగిపోయిన కొందరు భారతీయులు మనసు మార్చుకుని కెనడా వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. డబ్బులు ఉన్నవారికి ఫీజుల మోత.. కష్టపడే ఉద్యోగులకు ఏళ్ల తరబడి నిరీక్షణ నడుమ అమెరికా కల ఒక తీరని వేదనగా మారుతోంది.