Begin typing your search above and press return to search.

అమెరికా హెచ్1బీ వ్యథలు : పాకిస్థానీలకు రెండేళ్లు.. భారతీయులకు జీవితకాలం లేటు..

అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కల నెరవేరడానికి ఒక మనిషి జీవితకాలం సరిపోయేలా లేదు.

By:  A.N.Kumar   |   19 March 2026 4:00 AM IST
అమెరికా హెచ్1బీ వ్యథలు : పాకిస్థానీలకు రెండేళ్లు.. భారతీయులకు జీవితకాలం లేటు..
X

అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కల నెరవేరడానికి ఒక మనిషి జీవితకాలం సరిపోయేలా లేదు. తాజాగా ఒక భారతీయ మూలాలున్న ఇమ్మిగ్రేషన్ నిపుణుడు వెల్లడించిన గణాంకాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని విచారకరమైన వాస్తవాలను బయటపెట్టాయి. భారతీయులు గ్రీన్ కార్డు పొందేందుకు సుమారు 134 సంవత్సరాలు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అసంబద్ధమైన నిరీక్షణ.. భారత్ వర్సెస్ ఇతర దేశాలు

అమెరికాలో నైపుణ్యం కలిగిన భారతీయులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'కంట్రీ క్యాప్' (దేశాల వారీ పరిమితి). పాకిస్తాన్, సోమాలియా వంటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు కేవలం రెండేళ్ల లోపే గ్రీన్ కార్డు పొందుతుంటే భారతీయులు మాత్రం దశాబ్దాల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. అమెరికన్ అడ్వకసీ కౌన్సిల్ స్థాపకుడు సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భారతీయులు తమ ఇష్టపూర్వకంగా తాత్కాలిక వీసాలపై (హెచ్-1బీ) కొనసాగడం లేదని, గ్రీన్ కార్డు వ్యవస్థలోని లోపాలే వారిని ఆ స్థితిలో బంధిస్తున్నాయని కుండబద్దలు కొట్టారు.

7% పరిమితి.. భారతీయుల పాలిట శాపం

అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్ 202 ప్రకారం ప్రతి దేశానికి గ్రీన్ కార్డుల కేటాయింపులో కేవలం 7% పరిమితి మాత్రమే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా అత్యధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాకు పంపిస్తున్న భారతదేశానికి కూడా అదే 7% వర్తించడం తీవ్రమైన అసమానతలకు దారితీస్తోంది.

ముఖ్యంగా ఈబీ-2 (అడ్వాన్స్‌డ్ డిగ్రీ హోల్డర్స్ , ఈబీ -3 (ప్రొఫెషనల్స్) కేటగిరీలలో భారతీయుల సంఖ్య భారీగా ఉంది. కేటో ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2023 నాటికి పెండింగ్‌లో ఉన్న 1.8 మిలియన్ దరఖాస్తుల్లో 68% భారతీయులవే కావడం గమనార్హం.

గ్రీన్ కార్డు రాకముందే మరణం?

ఈ నిరీక్షణ కేవలం సమయానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఒక మానవీయ సంక్షోభంగా మారుతోంది. గణాంకాల ప్రకారం సుమారు 4 లక్షలకు పైగా భారతీయులు తమ గ్రీన్ కార్డు చేతికి అందకముందే మరణించే అవకాశం ఉందని అంచనా. వేలాది మంది పిల్లలు 'ఏజ్ అవుట్' 21 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రులపై ఆధారపడలేకపోవడం సమస్యతో అమెరికాను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హెచ్-1బీ వీసా నిబంధనల వల్ల ఉద్యోగ మార్పుల్లో ప్రయాణాల్లో అనేక పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

పరిష్కారం ఎక్కడ ఉంది?

ఈ సమస్యను పరిష్కరించేందుకు 2023లో అమెరికా కాంగ్రెస్‌లో కొన్ని బిల్లులు ప్రతిపాదించబడినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అవి చట్టరూపం దాల్చలేదు. దేశాల వారీగా ఉన్న 7% కోటాను రద్దు చేయడం లేదా వార్షిక గ్రీన్ కార్డుల సంఖ్యను భారీగా పెంచడం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు తమ కష్టానికి తగిన గుర్తింపు లభించక, అనిశ్చితిలో బతుకుతున్నారు. ఈ వ్యవస్థాగత లోపాలను సరిదిద్దకపోతే అమెరికా తన గ్లోబల్ టాలెంట్ పూల్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.