600 డాలర్ల చలానా.. హెచ్-1బీ వీసా ఖల్లాస్.. అమెరికాలో 'ఇల్లు' మారితే ఇండియాకు రిటర్న్ టికెట్ తప్పదా?
అమెరికా అంటేనే అగ్రరాజ్యం.. అవకాశాల స్వర్గం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కలల సామ్రాజ్యం.. కానీ అక్కడ ‘కలలు’ కనడం ఎంత సులువో ఒక్క చిన్న ‘కలకలం’ రేగితే ఆ కలల సౌధం అంతకంటే వేగంగా కూలిపోతుందని తాజాగా ఓ ఘటన నిరూపించింది
By: A.N.Kumar | 10 July 2026 12:28 PM ISTఅమెరికా అంటేనే అగ్రరాజ్యం.. అవకాశాల స్వర్గం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కలల సామ్రాజ్యం.. కానీ అక్కడ ‘కలలు’ కనడం ఎంత సులువో ఒక్క చిన్న ‘కలకలం’ రేగితే ఆ కలల సౌధం అంతకంటే వేగంగా కూలిపోతుందని తాజాగా ఓ ఘటన నిరూపించింది. కేవలం 600 డాలర్ల ట్రాఫిక్ ఫైన్ కట్టలేదని ఒక భారతీయుడి హెచ్-1బీ వీసాను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు రద్దు చేసేశారు. అవును మీరు చదివింది నిజమే.. ‘స్పీడ్’గా వెళ్తే ఫైన్ వేస్తారు సరే కానీ ‘రూట్’ మార్చితే దేశం నుంచే పంపించేస్తారని మనోడు ఊహించి ఉండడు.
ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. సదరు వీసా హోల్డర్‌గారు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కోర్టు మెట్లు ఎక్కారు. జడ్జిగారు దయామయుడై "బాబు.. ఒక 600 డాలర్లు కట్టి పుణ్యం కట్టుకో" అని గడువు ఇచ్చారు. అంతటితో ఆగకుండా మనోడు సినిమా స్టైల్‌లో ఇల్లు మార్చేశాడు. కొత్త అడ్రస్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు చెప్పడం మర్చిపోయాడు. కోర్టు నుంచి వచ్చిన తదుపరి నోటీసులు పాత ఇంటి అడ్రస్‌కు వెళ్లి వెక్కిరించాయి. ఫలితంగా ఫైన్ పెండింగ్ పడింది.. ఆ వెంటనే "హోంల్యాండ్ సెక్యూరిటీ" ఎంట్రీ ఇచ్చింది.. వీసా క్యాన్సిల్ అయిపోయింది.
లక్ లగేజ్ లాంటిది.. రూల్స్ బుల్లెట్ లాంటివి
ఇప్పుడు అమెరికాలో ఉన్న మన దేశీయుల్లో ఒకటే టెన్షన్. "ఎప్పుడూ గ్రీన్ కార్డ్ కష్టాలు, లేఆఫ్‌ల గురించే ఏడ్చేవాళ్లం.. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాలా?" అని వాపోతున్నారు.
నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే
గర్ల్ ఫ్రెండ్ మారినా పర్లేదు కానీ అపార్ట్‌మెంట్ మారితే మాత్రం 10 రోజుల్లోగా యూఎస్.సీఐఎస్ కి చెప్పాల్సిందే. లేదంటే మీ వీసాకు శుభం కార్డు పడే ప్రమాదం ఉంది. ఇండియాలో చలాన్లు పెండింగ్ ఉంటే 'పోలీస్ వాళ్లు ఎప్పుడు పట్టుకుంటే అప్పుడు చూసుకుందాంలే' అని లైట్ తీసుకోవచ్చు. కానీ అమెరికాలో ఆ ఆటలు సాగవు. కోర్టు నోటీసు వచ్చిందంటే.. వీసా కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లే.. కేవలం 600 డాలర్ల కోసమే వీసా రద్దు చేయరు, కానీ కోర్టు ఆదేశాలను ధిక్కరించడం, వారెంట్లు పెండింగ్‌లో ఉండటం వంటివి ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం "తీరని నేరాలు"గా మారుతాయి.
అమెరికాలో హెచ్1బీ వీసా సాధించడం ఎంత కష్టమో.. దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం. డాలర్లు సంపాదించడం ముఖ్యం కాదు బాస్.. అక్కడ బండి నడిపేటప్పుడు, ఇల్లు మారేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే 600 డాలర్ల ఫైన్ కాస్తా.. ఇండియాకు వన్-వే రిటర్న్ టికెట్‌గా మారిపోతుంది. కాబట్టి ఇకనైనా మనవాళ్లు మరింత అప్రమత్తంగా ఉంటేనే అమెరికాలో 'హ్యాపీ'గా బ్రతకగలరు.
