ఆస్ట్రేలియాలో భారత రిపబ్లిక్ డే.. నెటిజన్ల ఆగ్రహం
ఇప్పుడు ఇలాంటి ఒక వ్యవహారమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన భారతీయులే పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే దేశభక్తి పేరుతో కొందరు చేసిన హడావుడి అలా ఉంది.
By: A.N.Kumar | 27 Jan 2026 5:32 PM ISTవిదేశాల్లో ఉంటున్న భారతీయుల దేశభక్తిని ఎవరూ శంకించరు. ఎవరూ ప్రశ్నించరు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టేలా దేశభక్తి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడి నిబంధనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ దేశభక్తిని చాటితే ఎవరికీ నష్టం ఉండదు. కానీ దేశభక్తి శృతిమించితే లేనిపోని అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఒక వ్యవహారమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన భారతీయులే పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే దేశభక్తి పేరుతో కొందరు చేసిన హడావుడి అలా ఉంది.
రిపబ్లిక్ డే.. సంబరాలు
రిపబ్లిక్ డే సందర్బంగా ఆస్ట్రేలియాలోని భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. కానీ ఆ సంబరాలే కొంత ఎబ్బెట్టుగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. భారీ శబ్ధాలతో డ్రమ్స్ వాయిస్తూ, సౌండ్ చేస్తూ మనది కాని దేశంలో.. మన దేశ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం చూసే వారికి కొంత ఇబ్బందికరంగా మారింది. స్థానికుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల పట్ల ఆగ్రహం తెప్పించే పరిణామంగా మారుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా యూనివర్శిటీలు భారతీయ విద్యార్థులను చేర్చుకోవడం తగ్గించాయి. శాశ్వత నివాసం విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇలాంటి సమయంలో వేరే దేశంలో ఉంటూ.. స్థానికుల్ని ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించడం సరికాదుని నెటిజన్లు సూచిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా, రోడ్ల మీద కాకుండా, ఓ సమావేశ మందిరంలో సంబరాలు జరుపుకుని ఉంటే ఈ వీడియో వైరల్ అయ్యేది కాదు. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొనేది కాదు. కానీ హద్దులు మీరి వ్యవహరించడంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు స్థానికుల్ని రెచ్చగొట్టేలా ఉంటాయని కొందరు కామెంట్ చేశారు. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి నిబంధనలు పాటిస్తునే తమ సంప్రదాయాన్ని కొనసాగించవచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచి కాదని చెబుతున్నారు.
వలసలపై ఉక్కుపాదం
ఇప్పటికే విదేశీయుల నివాసంపైన అమెరికా లాంటి దేశాల్లో ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారో చూస్తున్నాం. ప్రపంచ వ్యాపంగా వలస ప్రజలపైన స్థానికులు తమ వనరుల్ని దోచుకుంటున్నారనో, లేదా తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. చాలా దేశాలు విదేశీయుల నివాసంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పడు స్థానికులతో కలిసిపోవాల్సింది మానేసి..ఇలా తమ గుర్తింపును ప్రకటించే కార్యక్రమం చేపట్టడం స్థానికులను రెచ్చగొట్టే వ్యవహారంలా మారుతుందని నిపుణలు అభిప్రాపయడుతున్నారు. రోమ్ వెళ్లినప్పుడు రోమన్ లా బతకాలి. దేశభక్తి మనసులో ఉండాలి. కానీ తమ ఐడెంటిటీని బహిరంగ ప్రదర్శన చేయకూడదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల అనర్థాలు వస్తాయని సూచిస్తున్నారు. స్థానికుల్లో ఉన్న అసంతృప్తికి ఆజ్యం పోసినట్టవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన సంప్రదాయాలను పాటిస్తూనే.. స్థానిక వేశభాషలతో కలిసిపోవాలని అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
