Begin typing your search above and press return to search.

అమెరికా విద్యకు శక్తినిస్తున్న NRI దాతలు

అమెరికా విద్యా రంగానికి భారతీయ అమెరికన్లు (NRIలు) చేస్తున్న విరాళాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

By:  A.N.Kumar   |   4 Oct 2025 10:00 PM IST
అమెరికా విద్యకు శక్తినిస్తున్న NRI దాతలు
X

అమెరికా విద్యా రంగానికి భారతీయ అమెరికన్లు (NRIలు) చేస్తున్న విరాళాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలను నియంత్రించాలని, ప్రముఖ విశ్వవిద్యాలయాలకు ఫెడరల్ నిధులను పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతీయ మూలాలు కలిగిన అమెరికన్లు తమ అపారమైన దాతృత్వంతో అమెరికా విద్యను మరింత బలోపేతం చేస్తున్నారు.

$3 బిలియన్ విరాళాలతో విద్యా రంగంలో విప్లవం

2008 సంవత్సరం నుంచి ఇప్పటివరకు భారతీయ అమెరికన్లు అమెరికా విశ్వవిద్యాలయాలకు సుమారు $3 బిలియన్ (దాదాపు ₹25,000 కోట్లు) విరాళాలుగా అందజేశారు. ఈ భారీ నిధులు కేవలం నిర్మాణాలకే కాకుండా పరిశోధనా కేంద్రాలు, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక కీలక రంగాల్లో వినియోగించబడ్డాయి. దీని ఫలితంగా విద్యా విస్తరణ, కొత్త ఆవిష్కరణలు ఊపందుకోవడం, అమెరికా కార్మికశక్తి బలోపేతం వంటి పలు దిశల్లో సానుకూల ప్రభావం చూపుతున్నాయి.

భారతీయ విద్యార్థులు: అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకం

ఇండియాస్‌ఫోరా సంస్థ అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం సుమారు 2.7 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వీరి ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా $10 బిలియన్ ఆర్థిక లాభం ఏర్పడుతోంది, అంతేకాక పరోక్షంగా 93,000 ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి.

ఇదిలా ఉండగా భారతీయ అమెరికన్లలో 78% మంది బ్యాచిలర్ లేదా అంతకంటే ఉన్నతమైన డిగ్రీలు కలిగి ఉండటం దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది విద్య పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఇండియాస్‌ఫోరా వ్యవస్థాపకుడు ఎం.ఆర్. రంగస్వామి చెప్పినట్లుగా “విద్యను అత్యంత విలువైనదిగా భావించే భారతీయ అమెరికన్లు తమ మాటను నిధుల రూపంలో నిరూపిస్తున్నారు.” అని తెలిపారు.

ప్రముఖ దాతలు, భారీ విరాళాలు

భారతీయ అమెరికన్ దాతలు తాము విద్యాభ్యాసం చేసిన సంస్థలకు లేదా తమకు ఆసక్తి ఉన్న రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చారు. ఈ దాతృత్వానికి కొన్ని ముఖ్య ఉదాహరణలున్నాయి.

చంద్రికా & రంజన్ టండన్: న్యూయార్క్ యూనివర్శిటీ ఇంజినీరింగ్ స్కూల్‌కు $100 మిలియన్.

ఇంద్రా నూయి: యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కు $50 మిలియన్.

దేశ్ దేశ్‌పాండే: MIT లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపనకు $20 మిలియన్.

డాక్టర్ కిరణ్ & పల్లవి పటేల్: ఫ్లోరిడాలో మెడికల్ విద్యకు గణనీయ విరాళాలు.

మోంటే అహుజా: ఓహియోలోని విద్యాసంస్థలకు మద్దతు.

సతీష్ & యాస్మిన్ గుప్తా: టెక్సాస్‌లో విద్యా విస్తరణకు సహకారం.

సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కూడా సహకారం

విజ్ఞాన శాస్త్రాలు, ఇంజినీరింగ్‌తో పాటు, భారతీయ అమెరికన్లు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి.. అమెరికా విద్యా వ్యవస్థను సుసంపన్నం చేయడానికి కూడా విరాళాలు ఇస్తున్నారు. ప్రిన్స్టన్ యూనివర్శిటీలో స్థాపించబడిన ‘చద్దా సెంటర్ ఫర్ గ్లోబల్ ఇండియా’ వంటి సాంస్కృతిక ప్రాజెక్టులకు $140 మిలియన్ పైగా నిధులు సమకూర్చారు. ఇది భారతీయ వారసత్వాన్ని కాపాడడమే కాకుండా, అమెరికా విద్యా వ్యవస్థను సాంస్కృతికంగా మరింత సమృద్ధిగా మారుస్తోంది.

భారతీయ అమెరికన్ల ఈ అపూర్వ దాతృత్వం లేకుండా అమెరికా విద్యా రంగం ఈ స్థాయిలో ఎదగడం కష్టమే అనడంలో సందేహం లేదు. ఈ NRI దాతలే అమెరికా ఉన్నత విద్యకు పునాది స్తంభాలుగా నిలుస్తూ, భవిష్యత్తు తరాలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తున్నారు.