Begin typing your search above and press return to search.

అమెరికా కల.. విజయం వెనుక దాగిన వివక్షల ముళ్లబాట!

ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉన్న ఆ దేశానికి ఒక సంచిలో పుస్తకాలు, గుండె నిండా ఆశలతో వెళ్లిన భారతీయ విద్యార్థులు, యువకులు ఈనాడు ఆ దేశ రూపురేఖలనే మార్చే స్థాయికి ఎదిగారు

By:  A.N.Kumar   |   5 Sept 2026 4:00 PM IST
అమెరికా కల.. విజయం వెనుక దాగిన వివక్షల ముళ్లబాట!
X

స్వేచ్ఛ, అవకాశాలు, కలల సాకారానికి కేరాఫ్ అడ్రస్ అమెరికా. ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉన్న ఆ దేశానికి ఒక సంచిలో పుస్తకాలు, గుండె నిండా ఆశలతో వెళ్లిన భారతీయ విద్యార్థులు, యువకులు ఈనాడు ఆ దేశ రూపురేఖలనే మార్చే స్థాయికి ఎదిగారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓ పీఠాల నుంచి వైట్ హౌస్ కీలక పదవుల వరకు సత్తా చాటుతున్నారు. వైద్యం, టెక్నాలజీ, రాజకీయం.. ఏ రంగం చూసినా భారతీయుల సంతకం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ అపూర్వ విజయగాథ వెనుక ఇప్పుడు ఒక ఆందోళనకరమైన నీడ కమ్ముకుంటోంది. త్యాగాలు చేసి సాధించిన ఆ ఎదుగుదలే ఈనాడు వారిపైకి ద్వేషపు బాణాలు విసిరేలా చేస్తోంది.

ఒకప్పుడు ఆదరించిన నేలపైనే ఇప్పుడు ‘మీ దేశానికి తిరిగి వెళ్లండి’ అనే కఠిన స్వరాలు వినిపిస్తున్నాయి. వివేక్ రామస్వామి, కమలా హారిస్, జొరాన్ మామ్దానీ వంటి వారు రాజకీయ శిఖరాలను తాకుతున్నా ఉషా వాన్స్ వంటి ప్రముఖులు కీలక స్థానాల్లో నిలుస్తున్నా.. వారందరినీ ఒకే చోట కట్టిపడేస్తున్నది వారి "జాతి గుర్తింపు". సైబర్ ప్రపంచంలో వేధింపులు, ఆన్‌లైన్ హేట్ ట్రోలింగ్ ద్వారా వారి ప్రాతినిధ్యాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు పెరిగిపోతున్నాయి. పార్టీలు, భావజాలాలకు అతీతంగా కేవలం 'భారతీయ మూలాలు' ఉన్నందుకే లక్ష్యంగా మారుతుండటం అత్యంత విషాదకరం.

స్వంత ఊరును..కన్నవారిని వదిలి దశాబ్దాల పాటు కష్టపడి పన్నులు చెల్లిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన భారతీయుల శ్రమను.. నేడు "ఉద్యోగాలను లాక్కుంటున్నారనే" ముద్రతో చిన్నచూపు చూస్తున్నారు. హెచ్1బీ వీసాలు, స్థానిక ఉద్యోగాల చుట్టూ తిరిగే రాజకీయ సంకుచితత్వం మెల్లగా జాత్యహంకారంగా రూపాంతరం చెందుతోంది. ఆన్‌లైన్ నివేదికల్లో నమోదు కాని ఆవేదనలు, మీమ్స్ రూపంలో వస్తున్న అవమానాలు ఎందరో భారతీయ కుటుంబాలను మానసిక భయందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇది కేవలం కొందరిపై జరుగుతున్న దాడి కాదు. వలసదారుల శ్రమపై నిర్మితమైన అమెరికా మూలాలకే ఒక సవాలు. అమెరికాను తమ స్వంత ఇల్లుగా భావించి ప్రాణమర్పించేంతగా ప్రేమించిన భారతీయులకు ఈనాడు పరాయితనం అనుభవంలోకి రావడం గుండెలను పిండేసే నిజం. "అమెరికాలో భారతీయులు ఎంతవరకు ఎదిగారు?" అనే ప్రశ్నకు జవాబు దొరికింది కానీ "ఆ ఎదుగుదలను అక్కడి సమాజం ఎంతవరకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తోంది?" అనే ప్రశ్నే ఇప్పుడు ప్రతి ఒక్కరినీ తొలిచేస్తోంది. అడ్డంకులను దాటి గెలిచిన భారతీయులు.. ఈ ద్వేషపు గోడలను కూడా అధిగమిస్తారనే నమ్మకం ఉన్నప్పటికీ.. ఈ ప్రయాణంలో తగిలే గాయాలు మాత్రం మానని మచ్చలుగా మిగిలిపోతున్నాయి.