అమెరికాలో ప్రేమ కోసం తపించాడు.. ప్రియురాలు కాదన్నదని తనువు చాలించాడు
అమెరికాలో ఉన్నత చదువులతో ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఒక తెలుగు యువకుడి కలలు అర్ధాంతరంగా కరిగిపోయాయి.
By: A.N.Kumar | 25 Aug 2026 4:49 PM ISTఅమెరికాలో ఉన్నత చదువులతో ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఒక తెలుగు యువకుడి కలలు అర్ధాంతరంగా కరిగిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన నాగా భైరవ సాయి ప్రదీప్ టెక్సాస్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని ఘోరం సాయి ప్రదీప్ కుటుంబాన్ని, స్నేహితులను ద తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మల్కాజ్‌గిరి జిల్లా దమ్మాయిగూడలో పెరిగిన ప్రదీప్ చిన్నతనం నుంచే ఎంతో చురుకైన విద్యార్థి. భారత్‌లో బీబీఏ పూర్తి చేసి నెలకు రూ.1.5 లక్షల సాలరీతో మంచి ఉద్యోగాన్ని సాధించాడు. అయితే కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలనే బలమైన కోరికతో ఉన్నత చదువులకై 2024లో అమెరికా బాటపట్టాడు. అక్కడ ఆండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్‌లో మాస్టర్స్ చేస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడిన తన సోదరుడితో కలిసి టెక్సాస్‌లో నివాసముంటున్నాడు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆయన జీవితంలో ఊహించని మలుపు ఎదురైంది.
అమెరికా వెళ్లిన తర్వాత సిద్ధిపేటకు చెందిన ఒక యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రదీప్ తన ప్రేమానురాగాలను వ్యక్తపరిచినప్పటికీ ఆ యువతి నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ పరిణామంతో ప్రదీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆగస్టు 21న ఆ యువతికి పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో తట్టుకోలేని వేదనకు గురై తన అపార్ట్‌మెంట్‌లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో వెల్లడించారు.
తొలుత ఆర్థిక ఇబ్బందులే కారణమనే వార్తలు వచ్చినప్పటికీ ప్రేమ వైఫల్యమే ఈ దారుణానికి ప్రధాన కారణమని కుటుంబం చెబుతోంది. ఏది ఏమైనా బిడ్డకు పట్టిన ఈ గతిని తలుచుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సోదరుడు, ప్రదీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్క క్షణం ఆలోచించండి..
విదేశాల్లో ఉండే యువత ఎటువంటి భావోద్వేగ ఒత్తిళ్లు లేదా మానసిక సమస్యలు ఎదురైనా ఒంటరిగా నలిగిపోకూడదు. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కానీ ప్రాణాలను తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. భావోద్వేగ ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే కుటుంబ సభ్యులతో.. స్నేహితులతో లేదా కౌన్సెలర్లతో మాట్లాడి సహాయం పొందడం ఎంతో ముఖ్యం.
