Begin typing your search above and press return to search.

హైదరాబాదీకి రష్యా ఉద్యోగ ఆఫర్ ఒక పీడకల గా మారింది.

హైదరాబాద్ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రష్యా తీసుకెళ్లి, బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

By:  A.N.Kumar   |   18 Oct 2025 10:28 PM IST
హైదరాబాదీకి రష్యా ఉద్యోగ ఆఫర్ ఒక పీడకల గా మారింది.
X

హైదరాబాద్ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రష్యా తీసుకెళ్లి, బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్‌కు చెందిన మొహమ్మద్ అహ్మద్ (37) అనే యువకుడు ముంబైకి చెందిన ఓ నకిలీ ఏజెంట్ ద్వారా కట్టడం పనుల కోసం వీసా, పత్రాలు పొంది ఏప్రిల్ 25న రష్యాకు వెళ్లాడు.

అయితే రష్యా చేరుకున్న తరువాత నెల రోజులు అతనికి ఏ పని దొరకలేదు. ఆ తర్వాత అహ్మద్‌తో పాటు మరో 30 మందిని దూర ప్రాంతంలోని ఓ సైనిక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఆయుధాలపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బలవంతంగా యుద్ధరంగంలోకి పంపించారు.

* అహ్మద్ భార్య ఆవేదన.. బయటపడ్డ భయంకర వాస్తవాలు

తన భర్త ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న అహ్మద్ భార్య అఫ్షా బేగం, వెంటనే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గారికి లేఖ రాసి తన భర్త పరిస్థితిని వివరించింది. “నా భర్తతోపాటు శిక్షణ పొందిన 26 మందిలో 25 మందిని ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుకు పంపారు. వారిలో 17 మంది మరణించారని, అందులో ఒకరు భారతీయులని తెలిసింది. నా భర్త పారిపోవడానికి ప్రయత్నించగా కాలికి గాయమైంది. అయినప్పటికీ అతన్ని యుద్ధానికి వెళ్లమని బెదిరిస్తున్నారు” అని ఆమె తన లేఖలో పేర్కొంది.

యుద్ధరంగం నుండి అహ్మద్ పంపిన వీడియో సందేశంలో తన కష్టాలు వివరిస్తూ "ఇక్కడ యుద్ధం జరుగుతోంది. యుద్ధానికి వెళ్లమని చెప్పగా తుపాకీతో బెదిరించారు. నా కాలు విరిగిపోయింది, నడవలేకపోతున్నా. నన్ను ఇక్కడికి మోసం చేసి తీసుకొచ్చిన ఏజెంట్‌ను వదిలేయకండి” అని కన్నీటితో విజ్ఞప్తి చేశాడు.

* అధికారుల జోక్యం, అంతర్జాతీయ ఏజెంట్లపై చర్యలు చేపట్టాలని డిమాండ్

ఈ విషయం AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. దీనిపై స్పందించిన భారత రాయబార కార్యాలయం కౌన్సిలర్ తాడు మాము, రష్యా అధికారులతో సంప్రదింపులు జరిపి అహ్మద్ వివరాలు అందజేసినట్లు తెలిపారు.

ఈ తాజా ఘటన 2024 మార్చిలో రష్యాలో మరణించిన మరో హైదరాబాద్ యువకుడు మొహమ్మద్ అస్ఫాన్ విషాదాన్ని గుర్తు చేస్తోంది. అస్ఫాన్ కూడా దుబాయ్‌లోని ఏజెంట్ మాట నమ్మి రష్యాకు వెళ్లి, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు.

నకిలీ ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేస్తున్న అంతర్జాతీయ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, రష్యా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ యువకులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని బాధితుల కుటుంబాలు భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.