రష్యాలో నలుగురు భారత విద్యార్థులపై కత్తితో దాడి.. కలకలం
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. 15 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కత్తితో హాస్టల్ ఆవరణలోని స్పోర్ట్స్ హాల్‌లోకి ఒక్కసారిగా ప్రవేశించాడు.
By: A.N.Kumar | 8 Feb 2026 11:46 AM ISTరష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్ రాజధాని ఉఫా నగరంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్టేట్ మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి చొరబడిన ఒక ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కత్తి దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెనుక అంతర్జాతీయంగా నిషేధించబడిన నియో-నాజీ సంస్థ హస్తం ఉన్నట్లు వెల్లడవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
రక్తసిక్తమైన హాస్టల్ ప్రాంగణం
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. 15 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కత్తితో హాస్టల్ ఆవరణలోని స్పోర్ట్స్ హాల్‌లోకి ఒక్కసారిగా ప్రవేశించాడు. అక్కడ ఉన్న విదేశీ విద్యార్థులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాడు. కంటికి కనిపించిన వారినల్లా పొడవడంతో హాస్టల్ అంతా రక్తసిక్తమైంది. దాడి సమయంలో నిందితుడు నాజీ మారణహోమం గురించి నినాదాలు చేస్తూ బీభత్సం సృష్టించాడు. అత్యంత భయానక విషయం ఏమిటంటే బాధితుల రక్తంతో హాస్టల్ గోడపై నిందితుడు 'స్వస్తిక' (నాజీ చిహ్నం) గుర్తును గీసినట్లు రష్యాకు చెందిన 'బాజా' టెలిగ్రామ్ ఛానల్ వెల్లడించింది.
పోలీసులపైనా దాడి.. నిందితుడు అరెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అతడు లొంగిపోకుండా పోలీసులపై కూడా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. చివరకు తప్పించుకోలేక నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. అతడు నిషేధిత నియో-నాజీ సంస్థకు చెందినవాడిగా గుర్తించారు.
భారత రాయబార కార్యాలయం అప్రమత్తం
ఈ ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గాయపడిన భారత విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఉఫాకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కజాన్ నుంచి భారత కాన్సులేట్ అధికారుల బృందం ఉఫాకు చేరుకుంది. ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ విదేశాల్లో భారత విద్యార్థుల భద్రతను పెంచాలని కోరింది.
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
రష్యాలో వైద్య విద్య కోసం ఏటా వేలాది మంది భారతీయులు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వెళ్తుంటారు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఆందోళనగా ఉన్న కుటుంబాలకు, ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ హాస్టల్‌లోనే ఇలాంటి జాత్యహంకార దాడులు జరగడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం రష్యా అధికారులు ఈ ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
