ఎన్నారైలపై మాస్టర్స్ చదివే అమ్మాయిల 'వలపు' వల.. దోచేసుకుంటున్నారట..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మోసాలు చికాగో, సెయింట్ లూసియా వంటి ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని కొందరు ఎన్నారైలు కామెంట్ చేశారు.
By: A.N.Kumar | 25 Nov 2025 6:11 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో భారతీయ సంపన్నులైన ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హనీట్రాప్ మోసాలు కలకలం రేపుతున్నాయి. మాస్టర్స్ చదువుతున్న విదేశీ విద్యార్థినులు కొందరు.. ఇందులో భారతీయ విద్యార్థినులు సైతం ప్రేమ, రిలేషన్‌షిప్ పేరుతో ఎన్నారైలను మోసగిస్తూ, వారి నుంచి డబ్బు, విలువైన వస్తువులు, వ్యక్తిగత డేటాను దోచుకుంటున్నారు.
* హెల్పర్ ముసుగులో మోసం!
వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చి మాస్టర్స్ చేస్తున్న కొంతమంది అమ్మాయిలు... భారతీయ సంపన్నులను ముఖ్యంగా ఒంటరిగా ఉన్న ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని నమ్మించి, ఇళ్లలో హెల్పర్లుగా చేరిపోతున్నారు. మొదట్లో నమ్మకంగా ఉంటూ.. తర్వాత సమయం చూసి ఇళ్లలోని డబ్బులు, ఆభరణాలు, వ్యక్తిగత సమాచారం (డేటా), విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. దొంగతనం చేసిన ఈ వ్యక్తిగత డేటా, వీడియోలు, సందేశాలను ఆధారంగా చేసుకుని ఎన్నారైలను బ్లాక్‌మెయిల్ చేసి, లక్షల కొద్దీ డబ్బులు లాగుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌తో ఒత్తిడి పెట్టి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
* డల్లాస్, ఓహియోలో మోసాలు ఎక్కువ!
ఈ తరహా మోసాలు ముఖ్యంగా డల్లాస్, ఓహియో ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని ఓ యువతి 'ఎక్స్' వేదికగా వీడియో పోస్ట్ చేసింది. కొందరు మహిళలు హనీట్రాప్‌తో పాటు, వ్యక్తిగత వీడియోలు, మెసేజ్‌లను కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా మోసాల ద్వారా సంపాదించిన డబ్బుతో కొందరు విద్యార్థినులు ఇళ్లు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది. అయితే, డల్లాస్, ఓహియో వంటి ప్రాంతాలలో ఇలాంటి చీటింగ్‌లపై అరెస్టులు ఉండకపోవడంతో ఎన్నారైలే జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.
* ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న కొందరు విద్యార్థినులు!
కొంతమంది విద్యార్థినులు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ చీటింగ్‌లకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రేమ, లైంగిక వేధింపుల (అబ్యూస్) పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఆర్థికంగా ప్రయోజనం పొందడమే వీరి లక్ష్యం. సాధారణంగా దేశాల రహస్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించే హనీట్రాప్ టెక్నిక్‌ను, సంపన్న దేశంలో యువతులు ఇలా డబ్బు సంపాదించడానికి వాడుతున్నారు.
* నెటిజన్ల స్పందన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మోసాలు చికాగో, సెయింట్ లూసియా వంటి ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని కొందరు ఎన్నారైలు కామెంట్ చేశారు. "ఒక స్టూడెంట్ కేవలం రెండేళ్లలో $1 మిలియన్ (సుమారు 8 కోట్లు) సంపాదించింది" అని ఓ బాధితుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. మరికొందరు, "ఇలాంటి చీటింగ్‌లు ప్రపంచమంతటా ఉన్నాయి" అని పేర్కొంటున్నారు. ఈ మోసాలపై అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
* ఎన్నారైలకు సూచన: జాగ్రత్త సుమా!
విదేశాలలో ఒంటరిగా ఉన్న భారతీయ సంపన్నులు, ముఖ్యంగా సహాయకులను నియమించుకునేవారు, ఇటువంటి హనీట్రాప్‌లు, మోసాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను నమ్మకం లేని వ్యక్తులతో పంచుకోకపోవడం ఉత్తమం.
