Begin typing your search above and press return to search.

హెచ్1బీ డైలామా ... ఇండియానే బెటర్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడి పుణ్యమా అని ఇండియాలోని పలువురు యువకులు చిరకాల డాలర్ కలలు చెల్లాచెదురవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   15 Jan 2026 10:00 PM IST
హెచ్1బీ డైలామా ... ఇండియానే బెటర్!
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడి పుణ్యమా అని ఇండియాలోని పలువురు యువకులు చిరకాల డాలర్ కలలు చెల్లాచెదురవుతున్నాయి. ఇక భవిష్యత్తులో తాము అమెరికా వెళతామా? ఉద్యోగం చేస్తామా? డాలర్లు సంపాయిస్తామా అని మదనపడుతుంటే...మరోపక్క పదేళ్ల అనుభవం ఉన్నా, చేతిలో హెచ్1బీ వీసా ఉన్నా...రూ.35 లక్షల జీతం ఇండియాలో వస్తే అక్కడే బెటర్ అని అంటున్నారు. అమెరికాలోని సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నోట ఈ మాట వినవస్తోందంటే...అక్కడ వలసజీవులకు చీకటిరోజులు వచ్చాయన్నమాటే. ట్రంప్ కేవలం హెచ్1బీ వీసాలకు కఠిన ఆంక్షలు విధించమే కాకుండా...ఆ దేశానికి వెళ్ళిన వలస ఉద్యోగులు ప్రత్యేకించి ఇండియన్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. మా దేశ భద్రత కన్నా ఏదీ ముఖ్యం కాదు అంటున్నారు. అందుకే పదేళ్లపాటు అమెరికాలో ఉంటున్నా...సీనియర్ సాఫ్ట వేర్ జీవుల్ని అభద్రతాభావం వెంటాడుతోంది. ఇప్పటి దాకా ఇండియా వద్దే వద్దని అంటుండేవారు. ఇండియాలో ఏముంది చెత్త తప్ప, సమస్యలు తప్ప అని ఈసడించి ఎగతాళి చేసిన వారు కూడా ఇపుడు మళ్ళీ ఇండియా గురించి ఆలోచించే పరిస్థితి తలెత్తింది.

హెచ్1బీ వీసాదారులు...సీనియర్లకు అమెరికాలో ఉండాలా? వద్దా? అన్న డైలామా వెంటాడుతోంది. తమకు ఆన్ సైట్ రోల్ ఎన్నాళ్ళుంటుందో కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. ఇదే సమయంలో ఇండియా నుంచి రూ.35 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ వస్తోంది. ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇపుడు మాత్రం అమెరికాయే జీవితం అనుకునే సీనియర్ ఐటీ ఉద్యోగులు ఇక అక్కడ బతకడం వల్లకాదేమో అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ట్రంప్ హుంకరింపులతోపాటు...వలస జీవులపై అక్కడి కొందరు నేతలు విషం కక్కుతున్నారు. పెద్ద కంపెనీల్లో ఒక హెచ్1బీ ఉద్యోగి వందమంది అక్రమవలసదారులతో సమానమన్న ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఇంకా అమెరికా అని పట్టుకుని ఊగులాడాల్సిన అవసరం ఉందా అంటున్నారు.

వాస్తవానికి అమెరికా మార్కెట్ కూడా అంత ఆశాజనకంగానేం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్ లు ప్రకటిం చేస్తున్నాయి. క్లయింట్ల డిమాండ్ కూడా బాగా తగ్గుతోంది. మరో మాట చెప్పాలంటే ఇపుడు అమెరికా కంపెనీలు కూడా రిమోట్ కొలువులపైనే ఆసక్తి చూపుతున్నాయి. అలాంటి సమయంలో అమెరికాకు ఉద్యోగుల్ని పిలుచుకొచ్చి డాలర్లలో జీతం కుమ్మరించడం కన్నా...ఇండియాలోనో. ఇతర దేశాల నుంచే ఉద్యోగాలు చేసేలా అంగీకరిస్తే ఆ దేశ కరెన్సీలో తక్కువ జీతం ఇవ్వవచ్చని కొన్ని బడా కంపెనీల ఆలోచన. పైగా అమెరికాలో వలస వ్యతిరేక వాదం విపరీతం కావడంతో ప్రొఫెషనర్లు ప్రామిస్ లు ....సుదీర్ఘ బెంచీలపై ఉండటం మధ్య నలిగిపోతున్నారు.

తాజాగా ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా విధివిధానాలను సంపూర్ణంగా మార్చేసింది. లాటరీ విధానంలో వెయిటేజీ, జీతం ఆధారిత వెయిటేజీ, అధిక జీతం వచ్చేవారికే ప్రాధాన్యం, వెట్టింగ్, సోషల్ మీడియా ఖాతాల సంపూర్ణ సమీక్ష లాంటి అడ్డంకులు పెరిగిపోతుం డటంతోపాటు ఫీజు లక్షడాలర్లు అనడంతో హెచ్1బీ వీసా దొరకడమే కష్టంగా మారిపోతోంది. వ్యక్తిగత నైపుణ్యం కన్నా...పాలసీ రిస్క్ అధికంగా ఉన్న సమయంలో చాలా మంది సీనియర్లలో ఈ డైలామా ప్రారంభం అయ్యింది. యూఎస్ లో ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఇండియన్ ప్రాజెక్టులో యాక్టివ్ గా ఉండాలి. బెంచిపై ఉన్నా...క్లయింట్ ఇంటర్వ్యూకు అటెండ్ అయినా హెచ్1బీ వీసా కష్టమే అని చెప్పాలి.

కుటుంబ స్థితిగతులు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఒక సంవత్సరం చిన్నారి, భార్య, వయసుమీరిన తల్లిదండ్రులుంటే...ప్రాధాన్యాలు కచ్చితంగా మారిపోతుంటాయి. అందుకే హెచ్1బీ వీసా డైలామా అవసరమా? దీని కోసం ఇంత వత్తిడి తీసుకోవాలా? అనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా డాలర్ల కలల ప్రపంచం నుంచి ఐటీయన్లు వాస్తవానికి వచ్చేస్తున్నారు. అమెరికా భ్రమల నుంచి బైటపడి ఇండియా సో బెటర్ అనుకుంటున్నారు. ఇదే స్థితి కొనసాగితే ...అమెరికాలోని సీనియర్లు ఇండియా బాట పట్టక తప్పదనిపిస్తుంది.