హెచ్-1బీ ఉద్యోగదాతలకు అమెరికా బిగ్ షాక్.. రూ.2.1 కోట్ల వరకు భారీ జరిమానా
అమెరికా కలలు కంటూ... ఎన్నో ఏళ్ల కష్టాన్ని దారపోసి అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు, దశాబ్దాలుగా వారి నమ్మకమే ఆసరాగా నిలిచిన కంపెనీలకు మళ్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే వార్త ఎదురైంది.
By: A.N.Kumar | 7 Oct 2026 10:21 AM ISTఅమెరికా కలలు కంటూ... ఎన్నో ఏళ్ల కష్టాన్ని దారపోసి అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు, దశాబ్దాలుగా వారి నమ్మకమే ఆసరాగా నిలిచిన కంపెనీలకు మళ్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే వార్త ఎదురైంది. నిద్రలేని రాత్రులు, కంటిమీద కునుకు లేకుండా చేసిన కఠిన నిబంధనల తుఫాను అమెరికాలో వీసా రూపంలో మరోసారి పంజా విసరడానికి సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసా అంటే కేవలం ఒక వీసా పత్రం మాత్రమే కాదు... ఎన్నో కుటుంబాల భవిష్యత్తు, లక్షలాది మంది భారతీయుల ఆశాదీపం. కానీ ఇప్పుడు ఆ దీపం చుట్టూ మళ్లీ హెచ్చరికల మేఘాలు అలుముకుంటున్నాయి.
అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఒక కొత్త బిల్లు ప్రస్తుతం ఉద్యోగదాతలతో పాటు హెచ్-1బీ ఐటీ నిపుణుల గుండెల్లోనూ ఆందోళన రేపుతోంది. హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే సంస్థలపై ఊహించని రీతిలో సివిల్ జరిమానాలు విధించేందుకు అమెరికా కాంగ్రెస్ సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి బెత్ వాన్ డ్యూయెన్ మరో ఐదుగురు సభ్యులతో కలిసి అక్టోబర్ 1, 2026న "హెచ్1బీ వీసా ఫ్రాడ్ క్రాక్ డౌన్ యాక్ట్ (హెచ్.ఆర్ 10643)" అనే బిల్లును ప్రవేశపెట్టారు. మోసాలకు అడ్డుకట్ట వేయడమే దీని లక్ష్యమని చెప్తున్నప్పటికీ ఈ రకమైన తీవ్రమైన ఆంక్షలు భవిష్యత్తులో హెచ్-1బీ ఉద్యోగ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న భయం భారతీయుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం... ఉల్లంఘనలకు విధించే జరిమానాలను ఊహించనంతగా పెంచాలని భావిస్తున్నారు.
అమెరికన్ ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో హెచ్-1బీ ఉద్యోగులను నియమించడం వంటి తీవ్రమైన ఘటనల్లో గరిష్ఠ జరిమానాను ప్రస్తుత 35,000 డాలర్ల నుంచి ఏకంగా 250,000 డాలర్లు (సుమారు ₹2.1 కోట్లు) కు పెంచాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా సదరు కంపెనీలపై విధించే స్పాన్సర్‌షిప్ నిషేధ కాలాన్ని మూడేళ్ల నుంచి ఏకంగా 10 ఏళ్లకు పొడిగించనున్నారు.
ఇతర ఉద్దేశపూర్వక నిబంధనల ఉల్లంఘనలకు గరిష్ఠ జరిమానాను 5,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లకు పెంచడం సహా స్పాన్సర్‌షిప్ నిషేధ కాలాన్ని రెండేళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు.
ఇమ్మిగ్రేషన్ పత్రాల్లో జరిగే మోసాలకు జరిమానాలను 1,000 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు, ఆ తర్వాత జరిగే తదుపరి ఉల్లంఘనలకు ఏకంగా 50,000 డాలర్ల వరకు విధించాలని స్పష్టం చేశారు.
ఏళ్ల తరబడి కష్టపడి అమెరికా ఐటీ రంగాన్ని తమ శ్రమతో నిలబెడుతున్న భారతీయ ఇంజనీర్లకు ఇటువంటి వార్తలు విన్న ప్రతిసారీ ఒక రకమైన అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది. కంపెనీలు స్పాన్సర్‌షిప్‌లు ఇవ్వడానికి వెనుకాడితే తమ పరిస్థితి ఏమిటని వేలాది మంది టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పునరుద్ఘాటిస్తున్నారు. ఇది కేవలం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు మాత్రమే. చట్టంగా మారాలంటే ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ ఆమోదం పొంది అధ్యక్షుడి సంతకం కావలసి ఉంది. ప్రస్తుతం ఇది హౌస్ జ్యుడీషియరీ కమిటీ పరిశీలనలో ఉంది. రాబోయే రోజుల్లో ఈ బిల్లుపై ఎలాంటి చర్చలు జరుగుతాయో.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
