భారతీయులకు హెచ్-1బీ వీసా అపాయింట్మెంట్స్ వాయుదా.. కారణం ఇదే!
హెచ్-1బీ వీసాల విషయంలో భారతీయులకు మరో తాత్కాలిక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
By: Raja Ch | 10 Dec 2025 9:24 AM ISTహెచ్-1బీ వీసాల విషయంలో భారతీయులకు మరో తాత్కాలిక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా పరిశీలన విధానం భారతదేశంలోని హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు అంతరాలను సృష్టించింది. అనేక నియామకాలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది.
అవును... మీ వీసా అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేయబడిందని మీకు ఈమెయిల్ అందితే.. మీ కొత్త అపాయింట్మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురుచూస్తోంది అని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి పేర్కొంది. ఈ సమయంలో.. గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీన కాన్సులేట్ కు వచ్చిన ఏ వీసా దరఖాస్తుదారుడికైనా రీషెడ్యూల్ గురించి తెలియజేయబడిన తర్వాత ప్రవేశం నిరాకరిస్తామని రాయబార కార్యాలయం హెచ్చరించింది.
దీనికి కారణం... ప్రతీ వీసా నిర్ణయం జాతీయ భద్రతా నిర్ణయం అని అమెరికా విదేశాంగ శాఖ చెబుతుండటమే! దీనిపై ప్రముఖ వ్యాపార వలస న్యాయ సంస్థకు చెందిన లాయర్ స్టీవెన్ బ్రౌన్ మాట్లాడుతూ... తాము వింటున్న విషయాన్ని మిషన్ ఇండియా ధృవీకరిస్తోందని.. వారు రాబోయే వారాల్లో అనేక అపాయింట్మెంట్ లను రద్దు చేసి, సోషల్ మీడియా పరిశీలనకు వీలుగా వచ్చే ఏడాది మార్చికి వాటిని తిరిగి షెడ్యూల్ చేశారని అన్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ కూడా నివేదించింది.
ఈ సమయంలో.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన హెచ్-4 వ్యక్తుల కోసం స్క్రీనింగ్ చర్యలను విస్తరించింది. ఈ క్రమంలో వారి అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్ లలో ప్రైవసీ సెట్టింగులను పబ్లిక్ గా ఉంచాలని వారిని ఆదేశించింది. ఇదే సమయంలో అమెరికా జాతీయ లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి డిసెంబర్ 15 నుంచి వారి ఆన్ లైన్ ఉనికిని సమీక్షిస్తారని తెలిపింది.
కాగా... ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్-1బీ వర్క్ వీసాలపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుమును విధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వు అమెరికాలో ఉపాధిని కోరుకునే భారతీయ కార్మికులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది! ఈ నేపథ్యంలో తాజాగా హెచ్-1బీ ప్రోగ్రామ్ తాజా పరిశీలనగా సోషల్ మీడియా స్క్రీనింగ్ నిలిచింది!
