Begin typing your search above and press return to search.

ఆందోళన కలిగిస్తున్న హెచ్-1బీ వీసాల జారీ!

అమెరికాలో ఉద్యోగం ఎన్నో కుటుంబాల కల. ఆ కలకు ద్వారం లాంటి హెచ్-1బీ వీసా మీదే వేలాది భారతీయులు తమ భవిష్యత్తును నడిపిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   19 Nov 2025 4:20 PM IST
ఆందోళన కలిగిస్తున్న హెచ్-1బీ వీసాల జారీ!
X

అమెరికాలో ఉద్యోగం ఎన్నో కుటుంబాల కల. ఆ కలకు ద్వారం లాంటి హెచ్-1బీ వీసా మీదే వేలాది భారతీయులు తమ భవిష్యత్తును నడిపిస్తున్నారు. కానీ ఈసారి గణాంకాలు ఒక కొత్త వాస్తవాన్ని మన ముందుంచుతున్నాయి. ఎన్నేళ్లుగా హెచ్-1బీ వీసాలను అధికంగా సాధించిన భారత ఐటీ రంగం ఇప్పుడు ముందు వరుసలో కనిపించడం లేదు. ఆ స్థానాన్ని అమెరికా అతిపెద్ద సాంకేతిక సంస్థలు ఆక్రమించుకున్నాయి. ఇది కేవలం గణాంక మార్పు కాదు భారత ప్రతిభపై గ్లోబల్ డిమాండ్ ఎలా మారుతోంది.. రాబోయే వలస విధానాలు ఎటు వెళ్లబోతున్నాయి అన్నదానికి హెచ్చరిక.

వీసాల పంపిణీలో స్పష్టమైన మార్పు

ఈ ఏడాది కొత్తగా మంజూరైన హెచ్-1బీ వీసాల్లో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఈ నాలుగు సంస్థలే నెగ్గినట్లుగా కనిపిస్తోంది. భారత సంస్థలు కలిపి పొందినదానికంటే ఒక్క అమెజానే ఎక్కువ వీసాలు పొందడం, అమెరికా సాంకేతిక రంగం ఇప్పుడు అత్యున్నత నైపుణ్యాలపై ఎంత దృష్టి పెట్టిందో సూచిస్తుంది. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, ఆధునిక కంప్యూటింగ్ వంటి రంగాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయి. ఇవన్నీ అత్యుత్తమ నైపుణ్యం కోరే రంగాలు అందుకే వీసాల ప్రవాహం కూడా అదే దిశగా మారిపోతోంది.

పనిచేయని పాత మోడల్..

ఈ సారి తొలి 25 కంపెనీల జాబితాలో భారతీయులు తక్కువే. ఒకప్పుడు వేల సంఖ్యలో వీసాలు పొందిన భారత ఐటీ రంగం, ఇప్పుడు తక్కువ సంఖ్యలోనే దొరకడం ఆందోళన కలిగించే విషయం. అమెరికాలో ‘స్థానికులను ప్రాధాన్యం’ అనే విధానం బలపడడం, భారతీయులు ఇక్కడి నుంచే రిమోట్ విధానంలో పనిచేయడం, అమెరికా సంస్థలు ఎల్-1 వంటి ఇతర వర్గాలను ఉపయోగించడం వంటివి అవుట్‌ సోర్సింగ్ బలాన్ని తగ్గిస్తోంది. భారత ఐటీ రంగం ఎన్నేళ్లుగా ఆధారపడిన మోడల్ ఇప్పుడు క్రమంగా బలహీనపడుతోంది.

వీసా లాటరీలో భారతీయులే సింహభాగం

85 వేల వీసాల కోసం 4.42 లక్షల మంది పోటీ పడటం ఒక పెద్ద రేసుగా చెప్పవచ్చు. దాదాపు ప్రతి ఏడాదిలా.. ఈసారి కూడా భారతీయులే ఎక్కువగా ఈ రేసులో ఉన్నారు. అయితే వీసా రద్దు రేటు తక్కువగా ఉండడం ఒక భరోసా కలిగించినా, ఎంపిక రేటు మాత్రం ఇప్పటికీ అదృష్టం, సామర్థ్యం, సరైన నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంది. అమెరికాలో ఉన్న సుమారు 7 లక్షల హెచ్-1బీ వీసాదారుల్లో ఎక్కువ శాతం భారతీయులే కావడం, ఈ పోటీకి మరింత బరువు పెడుతోంది.

భారత ప్రతిభ భవిష్యత్తుకు పరీక్ష

అమెరికా పాలన మారితే వలస విధానాలు ఎలా మారతాయి..? ఈ ప్రశ్న ప్రతి భారత ఇంజినీర్‌కు ముఖ్యమైనదే. మరింత నియంత్రణలు వస్తే అమెరికా సంస్థలు వారి వర్క్ విధానాన్ని భారత్ నుంచే చేయించుకునే అవకాశం ఉంది. మరోవైపు, అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి మాత్రం అవకాశాలు ఇంకా విస్తరించవచ్చు.

సాధారణ నైపుణ్యాలు ఇక సరిపోవు

ఎప్పుడో ఒకప్పుడు ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం’ అంటే ఒక స్థిర జీవితం. ఇప్పుడు ఆ నిర్వచనం మారిపోతోంది. కంపెనీలు సాధారణ నైపుణ్యాల కంటే లోతైన నైపుణ్యాలు, వాస్తవ ప్రాజెక్ట్ అనుభవం, కృత్రిమ మేధస్సు, స్వయంచాలకీకరణ, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ప్రావీణ్యం గల వారిని కోరుకుంటున్నాయి. భారత ప్రతిభకు ఇది ఒక పిలుపు పోటీ ఇక సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరింది.